ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ప్రభావం నుంచి కోలుకుంటుందని ఐహెచ్ఎస్ మార్కిట్ వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22) భారత్ 6.7 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని అంచనా వేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అన్ లాక్ ప్రక్రియలు ఇందుకు ఊతమందించనున్నట్లు గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహం..
కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నా.. భారత్‌కు భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు తరలిరావడం భారత వృద్ధికి మరింత ప్రోత్సాహమిస్తున్నట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ వెల్లడించింది. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో విదేశీ టెక్ సంస్థలు భారత్‌లో 17 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ భారత్‌లో 10 బిలియన్ డాలర్లు (రూ.75 వేల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ఇటీవలే ప్రకటించడాన్ని గుర్తుచేసింది.
అన్‌లాక్‌తో వృద్ధి దిశగా..
దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల జూన్‌లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ పర్చేజింగ్ మేనేజర్స్ సర్వే పేర్కొంది. ఈ సానుకూలతలు 2020 రెండో అర్ధ భాగం మొత్తం కొనసాగొచ్చని తెలిపింది.
భారత్‌పై కరోనా ప్రభావం..
కరోనా నేపథ్యంలో మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే మధ్య పారిశ్రామికోత్పత్తి, వినియోగదారుల కొనుగోలు శక్తి రెండూ తీవ్రంగా ప్రభావితమైనట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ గుర్తు చేసింది. 2020-21 వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పోలిస్తే 6.3 శాతం తగ్గి.. మాంద్యం నెలకొంటుందని గతంలో అంచనా వేసింది.
ఇదీ చూడండి:రికార్డు స్థాయికి బంగారం ధర- 10 గ్రాములు ఎంతంటే..