దేశంలో నిరుద్యోగం రేటు మళ్లీ భారీగా పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు మైక్రో లాక్డౌన్లు విధిస్తుండటం సహా అనేక పరిణామాలు నిరుద్యోగం పెరిగేందుకు కారణంగా తెలుస్తోంది.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) ప్రకారం... ఆగస్టు 9తో ముగిసిన వారానికి దేశంలో నిరుద్యోగం రేటు 8.67 శాతంగా నమోదైంది. ఇది ఐదు వారాల గరిష్ఠానికి సమానం. ఆగస్టు 2తో ముగిసిన వారానికి దేశ నిరుద్యోగం రేటు 7.19 శాతంగా ఉండటం గమనార్హం.
గ్రామీణ ప్రాంతాల్లో 8 వారాల గరిష్ఠం..
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు అత్యధికంగా 8 వారాల గరిష్ఠానికి చేరినట్లు సీఎంఐఈ పేర్కొంది. ఆగస్టు 9తో ముగిసిన వారానికి గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు 8.37 శాతంగా నమోదైంది. అంతకు ముందు వారం ఇది 6.47 శాతం.
పంటలు వేసే సమయం దాదాపు ముగింపు దశకు చేరుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం సమస్య మళ్లీ భారీగా పెరిగినట్లు సీఎంఐఈ పేర్కొంది.
పట్టణ ప్రాంతాల్లో మాత్రం నిరుద్యోగం సమస్య ఆగస్టు 2తో పోలిస్తే.. ఆగస్టు 9 నాటికి 9.31 శాతం నుంచి 8.73 శాతానికి తగ్గింది. నెలవారీ ప్రాతిపదికన జులైలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు 9.15 శాతంగా ఉంది.
వలస కూలీల తిరుగు ప్రయాణం..
గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు తగ్గిపోవడం వల్ల లాక్డౌన్ సమయంలో ఇళ్లకు వెళ్లిన వలస కూలీలు తిరిగి పట్టణాలకు వస్తున్నారు. మరోవైపు నిర్మాణ, టెక్స్టైల్ రంగాలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడం కూడా వలస కూలీలు పట్టణాల బాట పట్టేందుకు కారణమంటున్నారు విశ్లేషకులు. గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా పని కల్పిస్తున్నా.. చాలా మందికి వారి నైపుణ్యాలకు తగ్గ వేతనం లేకపోవడం వల్ల కూడా తిరిగి పట్టణాలకు వస్తున్నట్లు చెబుతున్నారు.
ఇదీ చూడండి:ల్యాప్టాప్ల వ్యాపారానికి తొషిబా గుడ్ బై