ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఐదో స్థానానికి ఎగబాకినట్లు ప్రముఖ పరిశోధనా సంస్థ వరల్డ్ పాపులేషన్ రివ్యూ(డబ్ల్యూపీఆర్) స్పష్టం చేసింది. 2019 సంవత్సరంలో యూకే, ఫ్రాన్స్‌లను అధిగమించినట్లు వెల్లడించింది. స్వయం చాలిత విధానాల నుంచి బయటపడి బహిరంగ మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా భారత్ అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించింది.
యూకే జీడీపీ 2.83 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా.. ఫ్రాన్స్ జీడీపీ 2.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2.94 ట్రిలియన్ డాలర్లతో భారత్ ఈ రెండు దేశాలను దాటిందని స్పష్టం చేసింది డబ్ల్యూపీఆర్.
భారత్‌లో కొనుగోలు సామర్థ్యం(పీపీపీ) ప్రకారం భారత జీడీపీ జపాన్, జర్మనీలను అధిగమించి 10.51 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని వెల్లడించింది డబ్ల్యూపీఆర్. దేశంలో అధిక జనాభా కారణంగా తలసరి జీడీపీ కేవలం 2,170 డాలర్లుగా ఉందని తెలిపింది. అమెరికాలో తలసరి జీడీపీ 62,794 డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది.
వృద్ధి మరింత కిందకు..
భారత వాస్తవ జీడీపీ వృద్ధి వరుసగా మూడో ఏడాది పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వృద్ధి 5 శాతానికే పరిమితం అవుతుందని అంచనా వేసింది.
1990లో ప్రారంభమైన ఆర్థిక సరళీకరణలు వృద్ధిని పెంచడానికి దోహదం చేశాయని డబ్ల్యూపీఆర్ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో 60 శాతం వాటా ఉన్న భారతీయ సేవారంగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని స్పష్టం చేసింది. తయారీ, వ్యవసాయ రంగాలు సైతం ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్నట్లు తెలిపింది.