ఉద్యోగం కానీ.. చిన్న వ్యాపారం కానీ.. ఏదైన సవ్యంగా సాగుతున్నప్పుడు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి ఏ కారణంతోనైనా కొన్ని రోజులు ఉద్యోగం, వ్యాపారం చేయలేని స్థితిలో ఉంటే.. పరిస్థితి ఏంటి అని అలోచించారా? వీటినే అత్యవసర పరిస్థితులుగానూ పరిగణించొచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో నెలవారీ రాబడి ఉండకపోగా ఇంటి ఖర్చులు, పిల్లల విద్యా ఫీజులు, నెల నెలా చెల్లించాల్సిన ఈఎంఐలు పెద్ద భారంగా మారుతాయి. చేతిలో ఉన్న మొత్తం ఖర్చయిపొతే ఎక్కువ వడ్డీకి క్రెడిట్ కార్డు ద్వారానో, బంధువులు, స్నేహితుల దగ్గరో అప్పుచేసి, ఇంకా పెద్ద మొత్తం అవసరమైతే ఏదైనా ఆస్తి లేదా బంగారం తాకట్టు పెట్టి ఇబ్బందులు పడాల్సి వస్తుంది… కొన్ని సందర్భాలలో భవిష్యత్తు కోసం చేసిన పెట్టుబడులనూ వాడవలసి రావచ్చు.
మరి ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం ఉన్న ఉత్తమమైన మార్గం 'అత్యవసర నిధి'ని ఏర్పాటు చేసుకోవడం. ఇంతకి అత్యవసర నిధిని ఎలా.. ఏర్పాటు చేసుకోవాలి? దాన్ని ఎలా నిర్వహించాలి అనే అంశాలపై పూర్తి సమాచారం మీ కోసం.
అధిగమించడం ఎలా..
ఇలాంటి ఇబ్బందులను అధిగమించాలి అంటే కొంత మొత్తాన్ని అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చెసుకోవాలి. ఈ నిధిని వీలైనంత త్వరగా, పెట్టుబడులు పెట్టే కంటే ముందే ఏర్పాటు చెసుకోవాలి. దీని ద్వారా భరోసా లభించడం సహా అధిక వడ్డీ రుణాలు తీసుకోవడం, దీర్ఘకాలిక పెట్టుబడులకు అంతరాయం కలిగించడం వంటివి నివారించవచ్చు.
ఎంత మొత్తం అవసరం..
సాధారణంగా ఇలాంటి అత్యవసర పరిస్థితులు కొన్ని వారాలు లేదా నెలల పాటు ఉంటాయి. కాబట్టి మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడే మొత్తాన్నిఅత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి అనుకుంటే అందుకు తగిన మొత్తం ఉంటే మంచిది.
ఎక్కడ పొదుపు చేయాలి..
సాధారణంగా అవసరానికి అందుబాటులో ఉంటుందని డబ్బు ఇంట్లో ఉంచుకోవడమో లేదా బ్యాంకు పొదుపు ఖాతాలో జమ చేయడమో చేస్తుంటాం. కానీ డబ్బు అందుబాటులో ఉండమే కాదు, దానిపై రాబడీ ముఖ్యమే. అందుకే ఈ నిధిలో కొంత మొత్తం.. అంటే పది వేల వరకు నగదు రూపంలో ఇంటిలో అందుబాటులో ఉంచుకోవాలి. బ్యాంకు ఏటీఎంకి వెళ్లి డబ్బు తెచ్చే అవకాశం లేని సందర్భాలలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
లిక్విడ్ ఫండ్లలో మదుపు..
బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము ఏటీఎం కార్డు ద్వారా వెంటనే పొందే అవకాశం ఉన్నా రాబడి చాలా తక్కువగా ఉంటుంది. బ్యాంకు ఖాతా కంటే ఎక్కువ రాబడినిస్తూ అవసరానికి అంతే అనువుగా ఉండే బ్యాంకు ఫ్లెక్సి డిపాజిట్లు లేదా లిక్విడ్ ఫండ్లలో మదుపు చెయ్యాలి. వీటి ద్వారా ఎక్కువ రాబడి ఉంటుంది, పైగా ఒక్క రోజులో డబ్బు చేతికందే సౌకర్యం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసర నిధిని విత్ డ్రా చేసుకునే వీలు లేని, లాక్ఇన్ పీరియడ్ ఉన్నసాధనాలలో పెట్టుబడి పెట్టకూడదు.
ఖర్చు చెయ్యడం..
ఈ నిధిని కేవలం అత్యవసరాలకు మాత్రమే వాడాలి. ఆ సమయంలో వీలైనంత పొదుపుగా ఖర్చు చెయ్యాలి. పరిస్థితుల్లో స్థిరత్వం వచ్చే వరకు ఇంతక ముందే నిర్ణయించిన స్లిప్‌ల ద్వారా పెట్టుబడి నిలుపు చేయవచ్చు. అలాగే బ్యాంకులను సంప్రదించి రుణాల ఈఎంఐలు కొంత కాలం ఆపే వెసులుబాటు ఉంటే ఏర్పాటు చేసుకోవాలి. తప్పని పరిస్థితి అయితే తప్ప ఈ నిధిని వాడకూడదు అనే నిబద్దత ఉండాలి.
తిరిగి నిధిని సమకూర్చుకోవడం..
అవసరానికి ఈ నిధిని ఉపయోగించుకున్న తరవాత ఈ నిధి గురించి మరిచిపోకుండా.. వీలైనంత త్వరగా తిరిగి ఏర్పాటు చెసుకోవాలి.
ఇదీ చూడండి: ఫాస్టాగ్‌తో టోల్ వసూలు కోసం ప్రత్యేక అధికారులు