కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రతి ఒక్కరిపై పడింది. లాక్‌డౌన్‌తో వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీని ఫలితంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. భారత్‌లో లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ 45 శాతం వరకు క్షీణించినట్లు 'ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్' మేలో అంచనా వేసింది. మూడీస్, ఫిచ్ వంటి రేటింగ్ ఏజెన్సీలు భారత రుణ, కరెన్సీ రెేటింగ్ను తగ్గించాయి.
భారీగా తగ్గిన ఉత్పత్తి..
దేశంలో మార్చి చివరి వారంలో లాక్‌డౌన్ మొదలైంది. ఏప్రిల్ నెలలో దేశం పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉండిపోయింది. ఫలితంగా ఆ నెలలో తయారీ సంస్థలన్నీ మూతపడ్డాయి. దీనితో భారత పారిశ్రామిక ఉత్పత్తి గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 55.5% తగ్గింది. గనులు, తయారీ, విద్యుత్ వంటి కీలక రంగాల్లోనూ పూర్తి స్థాయిలో పనులు జరగలేదు. అయితే అనుకోని ప్రతికూలతల వల్ల ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల గత ఏడాది ఏప్రిల్ ఐఐపీని 2020 ఏప్రిల్‌తో పోల్చడం సరికాదని నిపుణులు అంటున్నారు.
వాహన రంగం కుదేలు..
దాదాపుగా వ్యాపారాలన్నీ మూసేయడం వల్ల ఏప్రిల్‌లో సేవల పరిశ్రమ పతనమైందని ఐహెచ్ఎస్ మర్కిట్ చేసిన ఓ ప్రైవేటు సర్వే ద్వారా తెలిసింది. ఈ సూచీ దాదాపుగా 5.4కు చేరుకుంది. సాధారణ అంచనా 40శాతం కన్నా ఇది ఎంతో తక్కువ. 50శాతం కన్నా ఎక్కువగా ఉంటే విస్తరిస్తున్నట్టు, తక్కువగా ఉంటే సూచీ సంకోచించినట్టు భావిస్తారు. వాణిజ్య కార్యకలాపాల సూచీ కూడా గత నెల్లో 12.6కు చేరుకోవడం గమనార్హం. ఇక వాహన తయారీ పరిశ్రమైతే రోజుకు 300 మిలియన్ డాలర్ల మేర నష్టపోయింది.
కొనుగోళ్లు తగ్గాయ్ ..
భారత్.. అతిపెద్ద వినియోగదారుల విపణి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదే మూలం. అయితే లాక్‌డౌన్ సమయంలో వినియోగదారుల ఆత్మవిశ్వాసం భారీగా తగ్గిందని భారతీయ రిజర్వు బ్యాంకు చేసిన సర్వేతో తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల సూచీ, భవిష్యత్ అంచనాల సూచీలు రెండూ 100కు తక్కువగానే నమోదయ్యాయి. వందకు పైగా ఉంటేనే కొనుగోలుదారులు ఆశావాదంతో ఉన్నారని అర్థం. నిత్యావసరాలకు మాత్రమే ఖర్చు చేయాలని ప్రజలు భావిస్తున్నట్టు తెలిసింది.
పెరిగిన నిరుద్యోగ సమస్య..
తయారీ కర్మాగారాలు, సేవల సంస్థలు మూతపడటం వల్ల నిరుద్యోగితా శాతం ఒక్కసారిగా ఎగిసింది. లాక్‌డౌన్‌లో లక్షల మంది ఉన్నట్టుండి ఉపాధి కోల్పోయారు. మార్చి చివర్లో గ్రామీణ, పట్టణ నిరుద్యోగిత ప్రమాద ఘంటికలు మోగించిందని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్ర సమాచారం ద్వారా తెలిసింది. లాక్‌డౌన్ ప్రకటించిన వెంటనే పట్టణ నిరుద్యోగిత రేటు 10 నుంచి 30శాతానికి, గ్రామీణ నిరుద్యోగిత రేటు 10 నుంచి 25శాతానికి చేరుకుంది.
ఇదీ చూడండి:పెట్రో మోత @17వ రోజు.. నేటి ధరలు ఇవే