వచ్చే త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు సానుకూలంగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. వృద్ధిరేటును పరుగులు పెట్టించేందుకు, కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని షా గుర్తుచేశారు. ఫలితంగా వరుసగా ద్వితీయ, తృతీయ త్రైమాసికాల్లో క్షీణించిన వృద్ధి రేటు... రానున్న త్రైమాసికంలో మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు.
గుజరాత్ అహ్మదాబాద్‌లో రెండు బ్రిడ్జ్‌లను వర్చువల్‌గా ప్రారంభించిన షా... ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనా వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయి 2020-21 తొలి త్రైమాసికంలో(ఏప్రిల్-జూన్) స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ) రికార్డు స్థాయిలో 23.9శాతం పతనమైంది. అయితే ఆర్థిక వ్యవస్థ పురోగతికి చేపట్టిన చర్యలతో రెండు త్రైమాసికం(జులై-సెప్టెంబర్)లో తయారీ రంగం ఊపందుకోవడం వల్ల ఊహించిన దానికంటే వేగంగా పురోగతి సాధించి... భారత జీడీపీ 7.5 శాతం క్షీణతకు పరిమితమైంది.
ఇదీ చూడండి: జీడీపీ గణాంకాలు ఆశ్చర్యకరమే