'హెలికాప్టర్ మనీ'తో సంక్షోభంలో పడిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్బీఐకి సూచించారు. అంటే ఆర్‌బీఐ.. అదనంగా నోట్లు ముద్రించటం, లేదా మరేదైనా పద్థతిలో పెద్దఎత్తున నగదును వ్యవస్థలోకి తీసుకురావటమని దీని అర్థం.
కరోనా వల్ల కుదేలయిన ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి హెలికాప్టర్ మనీతోనే సాధ్యమా? వేరే మార్గాంతరం లేదా? అనే అంశాలపై ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీతో 'ఈటీవీ భారత్' మాట్లాడింది. గాంధీ ఆర్‌బీఐలో సుదీర్ఘకాలం సేవలు అందించారు. 2014- 17 మధ్య కాలంలో డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నారు.
ప్రశ్న: 'హెలికాప్టర్ మనీ' అంటే ఏమిటి? ప్రస్తుత పరిస్థితుల్లో దానికి ఏమేరకు ప్రాధాన్యం ఉంది?
దేశంలో సంక్షేమ పధకాలు అమలు చేయటానికి ప్రభుత్వం పెద్దఎత్తున ఖర్చు చేయటానికి కేటాయించే నగదును 'హెలికాప్టర్ మనీ' అంటారు. ఈ విధానంలో అన్ని రంగాలకూ పెద్దఎత్తున నగదు అందిస్తారు. యూఎస్ ఫెడ్ మాజీ ఛైర్మన్ బెన్ బెర్నెంకే ఈ విధానానికి పెద్ద మద్దతుదారుడు. అందుకే ఆయనను 'హెలికాప్టర్ బెన్' అని పిలుస్తారు.
సాధారణంగా 'హెలికాప్టర్ మనీ' అనేది కేంద్ర బ్యాంకులకు సంబంధించినది కాదు. క్వాంటిటేటివ్ ఈజింగ్ (క్యూఈ) అనేది కేంద్ర బ్యాంకులకు సంబంధించిన ప్రామాణిక పదం. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు సరఫరా పెంచటానికి కేంద్ర బ్యాంకు పెద్దఎత్తున ఆస్తులు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయటాన్ని క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటారు.
ప్రశ్న: ఎంత ఆర్థిక ప్యాకేజీ అవసరమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు?
మన దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 5 శాతానికి సమానమైన ఆర్థిక ప్యాకేజీ కావాలని ఆయన అడిగారు. అంటే దాదాపు రూ.10 లక్షల కోట్లు. కొందరు ఇతర నాయకులు అయితే రూ.20- 24 లక్షల కోట్ల ప్యాకేజీ కావాలని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇప్పటికే రూ.1.7 లక్షల కోట్ల 'పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన' ప్రకటించారు.
వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ ఆర్థిక సహాయం చేయాలని, ఎన్‌ఆర్‌ఈజీఏకు నిధుల కేటాయింపు పెంచాలని కోరాయి.
ప్రశ్న: వ్యవస్థలో నగదు సరఫరాను ఆర్‌బీఐ ఎలా పెంచుతుంది?
'క్వాంటిటేటివ్ ఈజింగ్' వైపు ఆర్‌బీఐ వెళ్లాలనుకుంటే, దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. కేవలం నోట్లు ముద్రించటమే కాదు. ఎంత సొమ్మును వ్యవస్థలో ప్రవేశపెట్టాలనుకుంటుందో, అందులో ఆరో వంతుకు నోట్లు ముద్రిస్తారు. మిగిలిన మొత్తాన్ని 'బుక్ ఎంట్రీ' పద్ధతిలో ఖాతాలకు జమ చేస్తారు.
ఆర్‌బీఐ కానీ, లేదా ఏ దేశంలోని కేంద్ర బ్యాంకు కానీ కరెన్సీని ముద్రించి నిల్వ చేస్తుంది. ఎప్పుడు అయితే నగదు విడుదల చేయాలనుకుంటుందో, అప్పుడు ఆ నిల్వలు బయట చెలామణిలోకి తీసుకువస్తారు.
ప్రశ్న: ఆర్‌బీఐ ముద్రించే నగదుకు సమానంగా ఆస్తులు ఉంటాయా?
ఆ నగదుకు సమానంగా కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు కానీ, విదేశీ సెక్యూరిటీలు కానీ ఉండాలి. ముందుగా కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీలు (బాండ్ల రూపంలో) మార్కెట్లో విక్రయిస్తుంది. వీటిని వాణిజ్య బ్యాంకులు, ఎల్‌ఐసీ, ఇతర ఆర్థిక సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఆ తర్వాత ఈ సంస్ధల నుంచి వీటిని అధిక వడ్డీరేటుకు ఆర్‌బీఐ కొనుగోలు చేసి, ఈ సెక్యూరిటీల విలువకు సమానంగా కరెన్సీ ముద్రిస్తుంది.
ప్రశ్న: ద్రవోల్బణం- వృద్ధి మధ్య సమతౌల్యాన్ని ఆర్‌బీఐ ఎలా సాధిస్తుంది?
ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత పెంచితే, వెంటనే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అందుకే నగదు లభ్యత పెంచాలని ఎన్ని వైపుల నుంచి డిమాండ్లు వచ్చినా... కేంద్ర బ్యాంకులు అంత సులువుగా అదనంగా నోట్ల ముద్రణకు సిద్ధపడవు. ఆర్థిక వ్యవస్థలో వస్తు- సేవల లభ్యతకు అనుగుణంగా నగదు చెలామణి ఉండాలి.
వస్తూత్పత్తి, సేవల లభ్యత పెరగకుండా కరెన్సీ పెంచితే, ధరలు పెరిగి అధిక ద్రవ్యోల్బణం సమస్య తలెత్తుతుంది. అందువల్ల ఈ అంశాన్ని ఆర్‌బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తుంది. నగదు లభ్యత ఎంత పెంచితే, ద్రవ్యోల్బణం ఎంతమేరకు పెరుగుతుంది, దాన్ని తట్టుకోగలమా? అనేది అంచనా వేస్తుంది. ఫలానా స్థాయి వరకూ ద్రవ్యోల్బణం పెరిగినా సరే... అనుకుంటే, ఆమేరకు నగదును ముద్రించి చెలామణిలోకి తీసుకువస్తుంది.
ద్రవ్యోల్బణం అదుపు తప్పిపోతుందనుకుంటే, ఆర్‌బీఐ ఆ రిస్కు తీసుకోదు. ఒక దేశం కరెన్సీ విలువ స్థిరంగా ఉండాలంటే, పారదర్శకమైన ద్రవ్య పరపతి విధానం ఎంతో ముఖ్యం. అందుకే అభివృద్ధి చెందిన దేశాల్లో... ద్రవ్య పరపతి విధానంపై పాలనా వ్యవస్థల నుంచి ఒత్తిడి రాకుండా కట్దుదిట్టమైన రక్షణలు అమల్లో ఉన్నాయి. ఆ దేశాల్లో కేంద్ర బ్యాంకుల వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఉండదు.
కాకపోతే సత్వర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో కొన్ని ప్రభుత్వాలు వడ్డీ రేట్లు తగ్గించాలని, 'రిజర్వు మనీ' తగ్గించి నగదు సరఫరా పెంచాలని కేంద్ర బ్యాంకులపై ఒత్తిడి తీసుకువస్తుంటాయి. మనదేశంలోనూ కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ గవర్నర్ మధ్య వడ్డీ రేట్లు తగ్గింపు విషయంలో విభేదాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అమెరికా ఫెడ్‌ను ఉద్దేశించి వడ్డీ రేట్లు సున్నాకు తీసుకువచ్చి అధిక వృద్ధి రేటు సాధ్యమయ్యే పరిస్థితి కల్పించాలని బహిరంగంగా కోరారు.
ప్రశ్న: జింబాబ్వేలో ఏం జరిగింది?
నోట్ల ముద్రణ ప్రభుత్వం చేతిలో పనే కదా..., కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ కలిసి ఎంత కావాలంటే అంత నోట్లు ముద్రించి చెలామణిలోకి తీసుకురావచ్చు కదా- అని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవంలో అది సాధ్యం కాదు.
కొన్ని లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు ఇష్టానుసారం నోట్లు ముద్రించి వ్యవస్థలోకి తీసుకువచ్చినప్పుడు ఎంతో అధిక ద్రవ్యోల్బణాన్ని ఆ దేశాలు ఎదుర్కొన్నాయి. అంతేగాక ఆ దేశాల కరెన్సీ విలువ భారీగా పతనం అయింది. దీనికి ఒక ఉదాహరణ జింబాబ్వే.
ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే ఆర్థిక కష్టాలను తట్టుకోవటానికి 2007- 09 మధ్య కాలంలో పెద్దఎత్తున నోట్లు ముద్రించింది. ఫలితం ఆ దేశం కరెన్సీ విలువ ఎంతో తగ్గిపోయింది. ఎంతగా అంటే... ఆ దేశం 100 ట్రిలియన్ జింబాబ్వే డాలర్ నోటును ముద్రించాల్సి వచ్చింది. ఒక దశలో ఆ నోటు విలువ 40 అమెరికా సెంట్లు మాత్రమే.
ఆ దేశ ప్రజలు జింబాబ్వే డాలర్ కంటే ఇతర దేశాల కరెన్సీని ఇష్టపడే పరిస్థితి వచ్చింది. ఆ ప్రభావం ఇంకా తగ్గలేదు. ఇప్పుడు కూడా జింబాబ్వేలో అమెరికా డాలర్, భారత రూపాయి తదితర విదేశీ కరెన్సీల్లో లావాదేవీలు అధికంగా జరుగుతున్నాయి.
ఇష్టానుసారం నోట్లు ముద్రిస్తే ఇదే జరుగుతుంది. కరెన్సీ విలువ తగ్గిపోతుంది. అంతేగాక అధిక ద్రవ్యోల్బణం తలెత్తుతుంది. ఇటువంటి విధానాల వల్ల కొన్ని ఆఫ్రికా దేశాల్లో ద్రవ్యోల్బణం 200 శాతం నుంచి 500 శాతం వరకూ పెరిగిన సందర్భాలు ఉన్నాయి.
ప్రశ్న: ఇతర దేశాల్లో 'క్వాంటిటేటివ్ ఈజింగ్' జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా?
2008 ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు అమెరికా, ఐరోపా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు పెద్దఎత్తున ఆస్తులు కొనుగోలు చేశాయి. తద్వారా వ్యవస్థలో నగదు సరఫరా పెంచి ఆర్థిక వ్యవస్థ కోలుకునే పరిస్థితులు కల్పించాయి. యూఎస్ ఫెడ్ (మనదేశంలో ఆర్‌బీఐ మాదిరిగా అక్కడి కేంద్ర బ్యాంకు) దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల విలువైన సెక్యూరిటీలు కొనుగోలు చేసింది. తత్ఫలితంగా 2014 అక్టోబరు నాటికి యూఎస్ ఫెడ్ ఆస్తి-అప్పుల పట్టీ 4.4 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
'క్వాంటిటేటివ్ ఈజింగ్'పై ఆర్థిక వేత్తలు, సంస్థల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి), కొందరు ఆర్థిక వేత్తలు దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందని చెప్పగా, 2012లో యూఎస్ ఫెడ్ మాజీ ఛైర్మన్ అలన్ గ్రీన్‌స్పాన్ మాత్రం 'క్వాంటిటేటివ్ ఈజింగ్' వల్ల నామమాత్రంగానే లబ్ధి ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచంలోని మూడవ అతిపెద్దదైన జపాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు రెండు దశాబ్దాలుగా డిఫ్లేషన్ (వస్తు, సేవలకు ఎటువంటి గిరాకీ లేని పరిస్థితి) లో చిక్కుకుపోయింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ (జపాన్ కేంద్ర బ్యాంకు) పెద్దఎత్తున 'క్వాంటిటేటివ్ ఈజింగ్'ను అమలు చేసి, వడ్డీ రేట్లను సున్నాకు తీసుకువచ్చినప్పటికీ పెద్దగా ఫలితాలు రాలేదు.
ప్రశ్న: కరెన్సీ ముద్రణ ఎలా నిర్ణయిస్తారు?
మనదేశంలో ఈ అంశాన్ని ఆర్‌బీఐ నిర్దేశిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు ఎంత ఉండొచ్చనే లెక్క తేలాక నగదు నిష్పత్తి (జీడీపీలో)ని లెక్కిస్తారు. దాని ప్రకారం ఎంత కరెన్సీని ముద్రించాలనేది నిర్ణయిస్తారు.
ఈ ఏడాది మార్చి నాటికి మనదేశ ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న నగదు రూ.24.39 లక్షల కోట్లు. ఈ మొత్తం 2019-20 జీడీపీలో దాదాపు 12 శాతానికి సమానం. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2020-21 ఆర్థిక సంవత్సరానికి 'నామినల్ జీడీపీ' 10 శాతం వృద్ధి నమోదు చేస్తుందని, జీడీపీ రూ.22.5 లక్షల కోట్లు అవుతుందనే అంచనాలు వెల్లడించారు.
ఎంత కరెన్సీని చెలామణిలోకి తీసుకురావాలనే అంశాన్ని నిర్ధరించే ముందు, ఆర్‌బీఐ అధికార వర్గాలు ఇంకా ఎన్నో అంశాలను పరిశీలిస్తారు. డిజిటల్ చెల్లింపుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, నగదు వినియోగం ఏమేరకు పెరుగుతోంది, ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి, నగదు సరఫరా మీద ప్రభావం చూపే ఇతర అంశాలు ఏమిటి? అనే వివిధ విషయాలను పరిశీలిస్తారు.
మనదేశంలో గత మూడేళ్ల ధోరణులను గమనిస్తే, జీడీపీలో- నగదు నిష్పతి పెరుగుతున్న విషయం స్పష్టమవుతుంది. 2018 మార్చి నాటికి నగదు నిష్పత్తి 10.7 శాతం ఉండగా, 2019 మార్చి నాటికి ఇది 11.23 శాతానికి పెరిగింది. 2020 మార్చికి వచ్చే సరికి ఇంకా పెరిగి 12.2 శాతం అయింది.
ప్రశ్న: హెలికాప్టర్ మనీని ఎవరు ప్రతిపాదించారు?
హెలికాప్టర్ మనీ పదాన్ని మొదటి సారి 1968లో మిల్టన్ ఫ్రీడ్‌మ్యాన్ అనే ఆర్థిక వేత్త వాడుకలోకి తీసుకువచ్చారు. 'ప్రతి ద్రవ్యోల్బణం' గుప్పిట్లో చిక్కుకుపోయిన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలంటే ఇదే చిట్టచివరి మార్గమని ఆయన అప్పట్లో సూచించారు. నగదు లభ్యత లేక వస్తు- సేవల ధరలు అనూహ్యంగా పతనం కావటాన్ని ప్రతి ద్రవ్యోల్బణ స్థితిగా పేర్కొంటారు.
ఇదీ చూడండి: మార్చిలో దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం