కరోనా సంక్షోభంతో కుదేలైన వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. తృణ ధాన్యాలు, వంట నూనెలు, ఉల్లిపాయలు, బంగాళదుంపల్ని నిత్యావసర చట్టం పరిధి నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఆ చట్టాన్ని సవరించనున్నట్లు తెలిపింది. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడిన వారికి ఊతమిచ్చేలా మొత్తం రూ. లక్షా 63 వేల కోట్ల రూపాయలతో వివిధ ఉద్దీపన చర్యలు అమలు చేయనున్నట్లు తెలిపింది కేంద్రం.
ఆత్మ నిర్భర భారత్ అభియాన్‌లో భాగంగా వరుసగా 3వ రోజు ఆర్థిక ప్యాకేజీ వివరాలను వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి మొత్తం 11 అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
1. మౌలిక వసతుల అభివృద్ధికి 8 చర్యలు
ప్యాకేజీలో భాగంగా వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు ఆర్థికమంత్రి నిర్మల. ఇందుకోసం సాధ్యమైనంత త్వరలోనే రూ. లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
![nirmala sitaraman package announcement day 3](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7212483_telugu-9-8.jpg)
2. మైక్రో ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్‌కు...
ప్రధానమంత్రి ప్రస్తావించిన 'వోకల్ టు లోకల్' నినాదాన్ని సాకారం చేసే విధంగా ఆహార రంగంలోని సూక్ష్మ పరిశ్రమలకు కేటాయింపులు జరిపినట్లు నిర్మల స్పష్టం చేశారు.
![nirmala sitaraman package announcement day 3](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7212483_telugu-9-7.jpg)
3. మత్స్యకారులకు
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేలా పలు కీలక ప్రకటనలు చేశారు నిర్మల. వ్యక్తిగత బోట్లు సహా మత్స్యకారులకు జీవిత బీమా సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. సముద్ర, ఇన్‌ల్యాండ్ చేపల వేట అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
![nirmala sitaraman package announcement day 3](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7212483_telugu-9-9.jpg)
4. పశు వ్యాధుల నియంత్రణ
ఎఫ్ఎండీ, బ్రూసెలోసిస్ వంటి వ్యాధుల నుంచి దేశంలోని 53 కోట్ల పశువులను రక్షించేలా జాతీయ జంతు వ్యాధి నివారణ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు ఆర్థికమంత్రి. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. లాక్డౌన్ కొనసాగినప్పటికీ.. గ్రీన్జోన్లలో కార్యక్రమం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
![nirmala sitaraman package announcement day 3](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7212483_telugu-9-6.jpg)
5. పశు సంవర్థక రంగ మౌలికం
పశుసంవర్థక రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు కేటాయించారు నిర్మల. డెయిరీ పరిశ్రమలో ప్రైవేటు పెట్టుబడులు పెరిగేలా సహకారం అందించనున్నట్లు తెలిపారు.
![nirmala sitaraman package announcement day 3](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7212483_telugu-9-5.jpg)
6. ఔషధ మొక్కల పెంపకం
పది లక్షల హెక్టార్లలో ఔషధ మొక్కల సాగు నిర్వహించడానికి ప్రణాళిక రచించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. జాతీయ ఔషధ మొక్కల బోర్డు సహకారంతో ఇప్పటికే 2.25 లక్షల హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకం చేపట్టినట్లు స్పష్టం చేశారు.
![nirmala sitaraman package announcement day 3](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7212483_telugu-9-11.jpg)
7. తేనెటీగల పెంపకం
తేనెపట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం పలు చర్యలు చేపట్టినట్లు నిర్మల తెలిపారు. తేనెటీగల పెంపకం కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు. తేనెటీగల సేకరణ, మార్కెటింగ్, నిల్వ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. పాలినేషన్ ద్వారా నాణ్యమైన తేనె ఉత్పత్తి చేసే విధంగా రైతులను ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు.
![nirmala sitaraman package announcement day 3](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7212483_telugu-9-10.jpg)
8. టాప్ టు టోటల్
కరోనా కారణంగా సరైన సరఫరా మాధ్యమాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కేంద్రమంత్రి నిర్మల పేర్కొన్నారు. దీంతో మార్కెట్లో ఉత్పత్తులు విక్రయించలేకపోతున్నట్లు వివరించారు. అందువల్ల టమాట(టీ), ఉల్లిపాయ(ఓ), బంగాళదుంపలకు వర్తించే ఆపరేషన్ గ్రీన్స్ పథకాన్ని అన్ని పళ్లు, కూరగాయలకు(టోటల్) వర్తించేలా మార్పులు చేశారు.
![nirmala sitaraman package announcement day 3](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7212483_telugu-9-4.jpg)
9. నిత్యావసరల చట్టానికి సవరణ
![nirmala sitaraman package announcement day 3](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7212483_telugu-9-3.jpg)
10. వ్యవసాయ మార్కెటింగ్‌లో సంస్కరణలు
![nirmala sitaraman package announcement day 3](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7212483_telugu-9-2.jpg)
11. వ్యవసాయ ఉత్పత్తి ధర, నాణ్యతకు భరోసా...
పంట వేసే సమయంలో రైతులకు ఆయా ఉత్పత్తుల ధరలు తెలిసే విధంగా సరైన వ్యవస్థ లేదని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. పారదర్శక విధానంలో రిటైలర్లు, ఎగుమతిదారులతో రైతులు సంప్రదించేలా సులభమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించనున్నట్లు తెలిపారు.
![nirmala sitaraman package announcement day 3](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7212483_telugu-9-new.jpg)
గత రెండు నెలల్లో..
2 నెలల లాక్డౌన్ కాలంలో రైతుల వద్ద నుంచి రూ.74,300 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు చెప్పారు ఆర్థికమంత్రి నిర్మల. దీనికి సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ కింద రూ.18,700 కోట్లను నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేసినట్లు తెలిపారు. గడిచిన రెండు నెలల్లో ఫసల్ బీమా కింద రూ.6400 కోట్లు పరిహారం ఇచ్చినట్లు స్పష్టం చేశారు.
లాక్డౌన్ నేపథ్యంలో డెయిరీ, ఇతర అనుబంధ రంగాలకూ ప్రభుత్వం సాధ్యమైనంత సాయం అందించిందని వివరించారు నిర్మల.
ఇదీ చదవండి: రైతుకు ఊతం: కరోనా ప్యాకేజ్ 3.0 హైలైట్స్