ప్రగతి రథాన్ని గాడిన పెట్టే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన చర్యలపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం చేపడుతున్న చర్యలు అసంపూర్ణంగా ఉన్నాయని విమర్శించింది. ప్రధాని మోదీ విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు.
"ప్రభుత్వం చర్యలు అంసపూర్తిగా ఉన్నాయి. కేవలం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో నిజాన్ని దాచిపెట్టలేరు. ప్రభుత్వ విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థ మందగిస్తోంది. జీడీపీ తగ్గుముఖం పడుతోంది. నిరర్ధక ఆస్తులు పెరగుతున్నాయి. ఇందుకు కారణాలను ప్రభుత్వం తెలియపరచాలి. దేశం ఇప్పుడు ఆర్థిక మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటోంది. "
-రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయిన ఆర్థిక వృద్ధిని మెరుగుపర్చడానికి కేంద్రం శుక్రవారం పలు చర్యలు ప్రతిపాదించింది. సంపన్నులపై అదనపు పన్నుల భారాన్ని తొలగించింది. అంకుర సంస్థలకు ఏంజెల్ ట్యాక్స్ మినహాయింపు, వాహన రంగ సంక్షోభానికి పరిష్కారాలు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు 70 వేల కోట్ల సాయం చేయనున్నట్లు కేంద్రం ప్రతిపాదించింది. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయని.. ఫలితంగా గృహ, వాహన రుణాలపై భారం తగ్గుతుందని తెలిపింది.
ఇదీ చూడండి: మాంద్యానికి 'సీతమ్మ మందు'తో లాభాలివే!