మరో వారంలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి వృద్ధిని పెంచే దిశగా రానున్న బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇక దేశీయ తయారీ, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా దిగుమతి సుంకాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే దాదాపు 50కిపైగా వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచనున్నట్లు తెలుస్తోంది.
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ ఉత్పత్తులు, రసాయనాలు, హస్తకళలు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, పరిశ్రమల రసాయనాలు, విద్యుత్ దీపాలు, కర్రతో చేసిన ఫర్నిచర్, క్యాండిల్స్, ఆభరణాలు తదితర వస్తువులపై కస్టమ్స్ సుంకాలు పెంచనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న రెండు వర్గాలు వెల్లడించాయి.
వీరిపై తీవ్ర ప్రభావం..
అయితే ఈ నిర్ణయం దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చాలా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఛార్జర్లు, ఇతర మొబైల్ భాగాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఐకియా లాంటి రిటైల్ సంస్థలు కూడా చాలా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో దిగుమతి సుంకాలు పెంచితే ఈ కంపెనీలపై అదనపు భారం తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. బడ్జెట్ ప్రకటనతోనే దీనిపై స్పష్టత వస్తుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఇదీ చూడండి:అంకుర సంస్థల గోడు వినండి