కరోనా ప్రభావంతో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించే విధంగా ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ అభియాన్ పథకం పూర్తి వివరాలను కేంద్రం వెల్లడించింది. మందగమనంలో కూరుకుపోయిన రంగాలకు తక్షణమే ఊతమందించేలా ప్యాకేజీలో ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించింది. లాక్డౌన్ ఇబ్బందులను అధిగమించి సంక్షేమ పథంలో ముందుకు సాగే విధంగా బడుగు బలహీన వర్గాలకు చేయుతనందించింది.
కార్మికులు, కర్షకులు, వేతన జీవులు, పన్నుచెల్లింపుదారులు, వీధి వ్యాపారులతో పాటు పేద, మధ్య తరగతి ప్రజానీకానికి ప్యాకేజీలో పెద్దపీట వేసింది. వృద్ధి అవకాశాలు మెండుగా ఉండే పారిశ్రామికం, రక్షణ రంగం, విమానయానం, ఖనిజ, బొగ్గు గనుల రంగాల్లోనూ విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది.
తొలి విడత
ఆత్మనిర్భర భారత్ తొలిరోజులో భాగంగా కార్మికులు, ఉద్యోగులకు ఊరట కలిగే విధంగా 15 సూత్రాలను రూపొందించింది కేంద్రం. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలపై ప్రధానంగా దృష్టిసారించింది.
రెండో విడత
రెండో ప్యాకేజీలో భాగంగా వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది మోదీ సర్కార్. లాక్డౌన్ కారణంగా చితికిపోయిన చిరు వ్యాపారులు, సన్నకారు రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా మొత్తం 9 విభాగాలకు సంబంధించిన ఉద్దీపనలు ప్రకటించింది.
మూడో విడత
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను లాక్డౌన్ కష్టాల నుంచి బయటపడేసే విధంగా మూడో విడతలో రూ. లక్షా 63 వేల కోట్ల రూపాయలతో ఉద్దీపన చర్యలు అమలు చేయనున్నట్లు తెలిపింది కేంద్రం. వ్యవసాయ రంగం మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది.
నాలుగో విడత
నాలుగో ప్యాకేజీలో భాగంగా ప్రైవేటు పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చింది కేంద్రం. వృద్ధికి ఆస్కారం ఉన్న ఎనిమిది రంగాల్లో భారీ మార్పులకు ఉపక్రమించింది. పెట్టుబడులు పెరిగేలా నిర్మాణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
చివరి విడత
చివరి విడతలో ఉపాధి హామీ, విద్య, వైద్యం సహా వ్యాపార సంబంధిత అంశాలపై సంస్కరణలు ప్రకటించింది కేంద్రం.