భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) తరలివస్తున్నాయి. డిసెంబర్లో ఇప్పటికే రూ.60,094 కోట్లు వచ్చి చేరినట్లు డిపాజిటరీస్ డేటా వెల్లడించింది. వీటిలో రూ.56,643 కోట్లు ఈక్విటీల్లోకి, రూ.3,451 కోట్లు డెట్ పథకాల్లోకి పెట్టుబడులుగా వెళ్లినట్లు తెలిపింది.
నవంబరులో మొత్తం రూ.62,951 కోట్ల ఎఫ్‌పీఐలు భారత్‌కు వచ్చాయి.
ఎఫ్‌పీఐల ప్రవాహనికి కారణాలు..
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా కదలాడుతుండడమే ఎఫ్‌పీఐలు పెరగడానికి కారణమని నిపుణులు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత పెట్టుబడుల రాక మరింత పెరింగిందని జియోజిత్ ఫినాన్షియల్ సర్వీసెస్‌లో పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ వెల్లడించారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల పోలిస్తే భారత విపణి కొంత సానుకూలంగా ఉందన్నారు. మన దేశంలో చేపడుతున్న ఆర్థిక సంస్కరణలే అందుకు కారణమని అభిప్రాయపడ్డారు. డాలరుతో రూపాయి మారకం విలువ మిగతా దేశాలతో కరెన్సీతో పోలిస్తే గత ఎనిమిది నెలల కాలంలో స్థిరంగా కొనసాగడం కూడా కలిసివస్తోందని వివరించారు. ఒక్క చైనాను మినహాయిస్తే భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే మెరుగ్గా ఉందని తెలిపారు నాయర్.
ఈ రంగాల్లోకి అధికం..
ఇక దేశానికి తరలివస్తున్న ఎఫ్‌పీఐలు ఎక్కువగా.. ఐటీ, ఫార్మా, రసాయన, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లోని కంపెనీలపై దృష్టి సారిస్తున్నారని నాయర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గుల కారణంగా స్వల్పకాలంలో ఎఫ్‌పీఐలు రాక నెమ్మదించే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఇదీ చూడండి:2030 నాటికి మూడో స్థానంలో భారత్