దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రతికూలంగా నమోదైంది. కరోనా సంక్షోభం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) జీడీపీ వృద్ధి రేటు -7.3 శాతంగా నమోదైంది. అయితే అంచనాల కంటే ఈ క్షీణత తక్కువే కావడం విశేషం. భారత్‌లో కరోనా రెండో దశ పుంజుకోవడానికి ముందు అంటే జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధి పుంజుకోవడంతో ఇది సాధ్యమైంది. జనవరి-మార్చిలో భారత్ 1.6% వృద్ధి నమోదు చేసింది. అక్టోబరు-డిసెంబరులో 0.5 శాతం వృద్ధి కనిపించింది. అంతక్రితం ఆరు నెలల పాటు లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పాలైన సంగతి తెలిసిందే. క్రితం ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో జీడీపీ 3% మేర వృద్ధి చెందింది.
వినియోగం తగ్గడంతోనే
గత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే కరోనా తీవ్రత మొదలైంది. దేశవ్యాప్తంగా మార్చి 25, 2020న లాక్‌డౌన్ విధించడంతో వినియోగం పడిపోయింది. ఆ తర్వాత దశలవారీగా ఆంక్షలు సడలించినప్పటికీ చాలా వరకు ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో 1979-80 తర్వాత పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ తొలిసారిగా క్షీణించింది. ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ 5.2% కుంగింది. 2019-20లో భారత్ 4% వృద్ధి చెందిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది 10-11 శాతం నమోదైతేనే
జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020-21లో భారత వాస్తవ జీడీపీ రూ.135 లక్షల కోట్లకు తగ్గింది. అంతక్రితం ఏడాది ఇది రూ.145 లక్షల కోట్లుగా ఉంది. తిరిగి రూ.145 లక్షల కోట్లకు చేరాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10-11 శాతం మేర ఆర్థిక వృద్ధి నమోదవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో మొదలైన కరోనా రెండో దశ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ ఇబ్బంది పడుతున్నాయి. అందువల్లే గతేడాది తక్కువ ప్రాతిపదిక ఉన్నప్పటి,© ఈ ఏడాది రెండంకెల వృద్ధి సాధ్యం కాకపోవచ్చని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020-21లో ఆర్థిక వ్యవస్థ 8 శాతం కుంగుతుందని ఎన్‌ఎస్‌ఓ; 7.5 శాతం తగ్గొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసిన సంగతి తెలిసిందే. మరో వైపు చైనా మాత్రం జనవరి-మార్చి 2021లో 18.3 శాతం వృద్ధి చెందింది.
టీకా వేగం పెరగాలి: ఆర్థికవేత్తల మాట
ఆర్థిక వ్యవస్థపై కరోనా రెండో దశ ప్రభావం భారీగా ఉండకపోవచ్చని ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ అంటున్నారు. అయితే ఈ ఏడాదీ రెండంకెల వృద్ధి నమోదవుతుందని అంచనా వేయడం కష్టమేనని అన్నారు. టీకాల వేగం పెరగాల్సి ఉందని, అపుడే మరో దశ కరోనా వచ్చే అవకాశాలను తగ్గించొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మరో వైపు ‘అంచనాల కంటే మెరుగ్గా గణాంకాలు నమోదైనా.. భారీ మార్పు లేదు. కరోనా మలి దశ కారణంగా 10 శాతంలోపు వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నాయ’ని ద ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్(ఇక్రియర్)కు చెందిన అలోక్ షీల్ అంటున్నారు.
9.3 శాతానికి ద్రవ్యలోటు
అధిక పన్ను వసూళ్ల కారణంగా ద్రవ్యలోటు 2020-21లో జీడీపీలో 9.3 శాతానికి పరిమితమైంది. కరెన్సీ విలువలో చెప్పాలంటే రూ.18,21,461 కోట్లుగా నమోదైంది. అంతక్రితం అంచనా 9.5 శాతం(రూ.18,48,655 కోట్లు)గా ఉంది. ఫిబ్రవరి 2020లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 3.5 శాతం(రూ.7.96 లక్షల కోట్లు)గానే అంచనా వేశారు. కరోనా లేని 2019-20లోనూ ఆదాయ వృద్ధి పెద్దగా లేకపోవడం వల్ల ద్రవ్యలోటు ఏడేళ్ల గరిష్ఠమైన 4.6 శాతానికి చేరిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో ఇది 6.8 శాతంగా నమోదు కావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏప్రిల్ 2021లో ద్రవ్యలోటు 5.2 శాతం(రూ.78,699 కోట్లు)గా ఉండొచ్చని అంచనా. లాక్‌డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్ 2020లో ఇది 35.1 శాతంగా ఉంది.
మళ్లీ 2018-19 స్థాయికి..: ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే తలసరి నికర ఆదాయం, వ్యయాలు 2018-19 స్థాయుల కంటే కాస్త ఎక్కువగా మాత్రమే ఉన్నాయి. తలసరి ఆదాయం ఏడాది క్రితం కంటే 4%, వ్యయం 7% తగ్గాయని తాత్కాలిక అంచనాలు వెల్లడిస్తున్నాయి.
2020-21 2018-19
తలసరి ఆదాయం : రూ.1,28,829 రూ.1,25,883
తలసరి వ్యయం : రూ.85,348 రూ.84,567