కరోనా కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతనందించే లక్ష్యంతో.. కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో రోజు వివరాలను వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో వలస కార్మికులనుద్దేశించి కీలక ప్రకటన చేశారు.
పట్టణ పేదలు, వలస కూలీల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సరికొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు నిర్మలా. ఇరువురికి అందుబాటులో ఉండేలా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్దతిలో గృహ నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. ఫలితంగా వారికి నివాస భారం తగ్గనుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని చేపడితే.. కేంద్రం తగిన సాయం అందిస్తుందన్నారు విత్త మంత్రి.
రేషన్ కార్డు లేకున్నా ఫర్వాలేదు..
'ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు' విధానం ద్వారా సరికొత్త విప్లవాన్ని తీసుకురానుంది కేంద్రం. రేషన్ కార్డు ఉన్నవారు దేశంలో ఎక్కడైనా సరకులు తీసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. వారందరికీ ఉచితంగా 5 కిలోల చొప్పున బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. వలస కార్మికులు కార్డు లేకున్నా.. ఆహార ధాన్యాలు పొందవచ్చన్నారు నిర్మలా.
"ఆగస్టు నాటికి ఒకే దేశం ఒకే కార్డు విధానాన్ని తీసుకొస్తాం. మార్చి 31, 2021 నాటికి వంద శాతం రేషన్ కార్డు పోర్టబిలిటీ పూర్తవుతుంది. తాజా నిర్ణయంతో ప్రస్తుతం 63 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది".
నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి
ఇకపై ఏజెన్సీలు ఉండరు..
వలస కార్మికులను ఏజెన్సీల ద్వారా కాకుండా.. సంస్థలు, కంపెనీలు నేరుగా నియమించుకునేలా ఆదేశాలు ఇస్తామని చెప్పారు నిర్మలా. 10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నింటికీ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పిస్తామని.. సుదూర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్తున్న కార్మికులకు నైపుణ్యం పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. ఇందుకోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద రాష్ట్రాలకు ఇప్పటికే రూ.11,002 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు.