కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగే అవకాశలున్నాయని బ్యాంకింగ్ నిపుణులు, ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా బ్యాంకులకు రానున్న బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల రీక్యాపిటలైజేషన్ ప్యాకేజీ ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
'అయితే ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేదానిపై ఇంకా స్పష్టత లేదు. బడ్జెట్ ద్వారా నేరుగా సహాయం చేయొచ్చు. లేదా బ్యాంకులు మూలధనాన్ని పెంచుకునేందుకు బాండ్లను జారీ చేసే అవకాశమూ లేకపోలేదు.' అని కేర్ రేటింగ్ ముఖ్య ఆర్థిక వేత్త మదన్ సబ్నావిస్ పేర్కొన్నారు.
మొండి రుణాల సమస్యను పరిష్కరించేందుకు బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆర్థిక మంత్రి ప్రకటించే అవకాశమున్నట్లు సబ్నావిస్ తెలిపారు.
బ్యాడ్ బ్యాంక్ అంటే..
సాధారణంగా వాణిజ్య బ్యాంకులు అవి ఇచ్చే రుణాలపై వచ్చే వడ్డీ ఆధారంగా మనుగడ సాగిస్తుంటాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల ఫలితంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఒకవేళ అవే రుణాలు నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ)గా అంటే మొండి బకాయిలుగా మారితే బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్‌ల పేరిట ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎన్‌పీఏలను దీనికి బదిలీ చేస్తారు.
మొండి బకాయిల సమస్య..
కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం వల్ల సమీప భవిష్యత్‌లో బ్యాంకుల ఎన్పీఏలు భారీగా పెరగొచ్చని మదన్ సబ్నావిస్ 'ఈటీవీ భారత్'తో అన్నారు. ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు ఎన్పీఏలు పెరగటం సాధారణంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తు చేశారు.
'ప్రస్తుతం ఆర్థిక మందగమనం ఉన్నా ఎన్పీఏలు పెరిగినట్లు కనిపించడం లేదు. అయితే సమీప భవిష్యత్‌లో మాత్రం మొండి రుణాలు భారీగా పెరిగే అవకాశముంది' అని వివరించారు.
భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఎన్పీఏలు 15% వరకు పెరగొచ్చని తెలిసింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కరోనా వల్ల తీవ్రంగా కుదేలవడం ఇందుకు కారణంగా పేర్కొంది ఆర్బీఐ నివేదిక.
ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులను మొండి బాకీల సమస్య కొంత కాలం వరకు స్థిరంగా వెంటాడొచ్చని ఎస్బీఐ మాజీ ఎండీ వీజీ కన్నన్ ఆందోళన వ్యక్తం చేశారు.