ఆర్థిక మాంద్యం ఉద్ధృతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌలిక సౌకర్యాల విస్తరణ ద్వారానే సంక్షోభాన్ని ఎదుర్కోవాలన్న వాదన గడచిన కొంతకాలంగా ఊపందుకుంటోంది. ఆ క్రమంలోనే మౌలిక సౌకర్యాల కోసం రాబోయే అయిదేళ్లలో రూ.కోటి కోట్లకుపైగా ఖర్చుపెట్టనున్నట్లుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు పెట్టుబడుల ప్రణాళికనూ సిద్ధంచేసింది. వరసగా మూడేళ్లపాటు వృద్ధిరేటు క్షీణముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆర్థిక వ్యవస్థలు క్లిష్ట పరిస్థితుల్లో ప్రస్థానిస్తున్నప్పుడు మౌలికరంగంపై వ్యయాలను పెంచడమన్నది ప్రపంచంలోని అనేక దేశాలు అనుసరిస్తున్న పద్ధతి. ఇందుకు దక్షిణ కొరియా ఉదంతమే తాజా ఉదాహరణ. వాణిజ్యంపైనే ప్రధానంగా ఆధారపడే ఆ దేశం ఎగుమతులు నిరుడు తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి. అమెరికా, చైనాల మధ్య తలెత్తిన వాణిజ్య విభేదాల కారణంగా సరఫరా వ్యవస్థలో ఆటంకాలు తలెత్తడంతో దక్షిణ కొరియా ఎగుమతులు చిక్కుల్లో పడ్డాయి. ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం నెమ్మదించింది. అదే క్రమంలో దేశంలో ఉద్యోగ అవకాశాల్ని పెంచి, ప్రైవేటు రంగం కార్యకలాపాలకు ఉత్తేజాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే మౌలికరంగ సదుపాయాల అభివృద్ధి కోసం 5,100 కోట్ల డాలర్ల ప్రణాళికను ప్రకటించారు. ఈ పెట్టుబడులు దేశంలో గిరాకీని పెంచుతాయని, తద్వారా ప్రైవేటు రంగం ఊపందుకుంటుందని, ఆర్థిక వ్యవస్థ పురోగమనం బాటపడుతుందని దక్షిణ కొరియా ప్రభుత్వం భావిస్తోంది. ఇంచుమించు ఇదే వ్యూహాన్ని వివిధ ప్రపంచ దేశాలూ అమలు చేస్తున్నాయి. మాంద్యానికి మందుగా భారత్ సైతం ఇప్పుడు ఇదే మార్గాన్ని ఎంపిక చేసుకోవడం హర్షణీయం. మౌలిక సౌకర్యాల కల్పనకు డబ్బు వెచ్చించడంతోపాటు- ఆ నిధులు వినియోగమవుతున్న తీరుపట్ల అప్రమత్తంగా ఉండటమూ అవసరమే.
ఆ ప్రాజెక్టుల జాప్యంతో లక్షల కోట్ల భారం..
నిర్దిష్ట కాలావధిలో మౌలిక రంగ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా వివిధ కారణాలతో వాటిని ఏళ్లుపూళ్లుగా నాన్చడంవల్ల ఖజానాకు భారీ బొర్రెపడుతోంది. దేశంలో రూ.150 కోట్లు ఆపై విలువగల 400 మౌలిక రంగ ప్రాజెక్టులు జాప్యం కారణంగా నిర్ణీత కాలావధిలో పూర్తికాకపోవడంవల్ల ప్రభుత్వంపై నాలుగు లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని కేంద్ర ప్రభుత్వ గణాంక సంస్థ నివేదిక వెల్లడించింది. రూ.కోటి కోట్లకుపైగా విలువైన పెట్టుబడుల ప్రణాళిక అమలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడానికి ఇంతకుమించిన ప్రణాళిక లేదు. మౌలిక రంగానికే పెద్దపీట వేస్తూ ప్రభుత్వం 80 శాతం పెట్టుబడుల్ని రహదారులు, పట్టణరంగం, గృహరంగం, రైల్వేలు, విద్యుత్తు, సాగునీటి రంగాల్లో పెట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 78 శాతంమేర భారాన్ని సమానంగా పంచుకోనుండగా, 22 శాతం ప్రైవేటు రంగం మోయాల్సి ఉంటుంది. జాతీయ మౌలికరంగ ప్రణాళికలో భాగంగా- 2020-2025 వరకు అమలు చేయదగిన మౌలికరంగ ప్రాజెక్టుల జాబితాను ఇందులో రూపొందించారు. వీటిలో కొన్ని ఇప్పటికే అమలులో ఉన్నాయి. గడచిన అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రహదారులు, గృహరంగం, పట్టణ, డిజిటల్, ఇతర మౌలిక రంగాల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.
వ్యాపారుల్లో కొరవడిన ఆత్మవిశ్వాసం
డిమాండ్ కోణంలో విశ్లేషిస్తే దేశంలో గడచిన అయిదేళ్లలో పరిస్థితి ప్రోత్సాహకరంగా లేదు. భారత్‌లో మొత్తం మౌలికరంగం పెట్టుబడులు 2013-14లో రూ.6.3 లక్షల కోట్లుగా ఉండగా, 2017-19 చివరి రెండేళ్లలో ఆ మొత్తం రూ.10 లక్షల కోట్లకు చేరింది. కేంద్ర ప్రభుత్వం తన వ్యయాల్ని రెట్టింపు చేసిన ఫలితంగా ఈ పెరుగుదల వచ్చింది. గత రెండేళ్లలో కేంద్ర మౌలికరంగ పెట్టుబడులు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర పెరిగాయి. మోదీ ప్రభుత్వ అయిదేళ్ల తొలి దశ పాలనలో మౌలిక రంగ పెట్టుబడుల్లో కేంద్రం వాటా మొదటి మూడేళ్లలో సుమారు 25శాతం నుంచి 13శాతం పాయింట్లు అధికమై 38 శాతానికి చేరింది. దురదృష్టవశాత్తూ వివిధ కారణాలవల్ల వాస్తవ జీడీపీ వృద్ధి 2017-18లో నెమ్మదించింది. 2018-19లో అది మరింతగా క్షీణించి కిందికి జారింది. ఈ ఏడాదీ తిరోగమనం వల్ల వాస్తవ జీడీపీ వృద్ధి అయిదు శాతానికి చేరే అవకాశం ఉంది. కొన్ని అంచనాల ప్రకారం అది అంతకన్నా తక్కువకూ పతనం కావచ్చు. జాతీయ నమూనా సర్వే సంస్థ అంచనాల ప్రకారం- 2017-18లో నిరుద్యోగిత రేటు నాలుగు దశాబ్దాల్లోనే గరిష్ఠంగా 6.1 శాతంగా నమోదైంది. ప్రైవేటు గణాంక సంస్థ ‘సీఎమ్‌ఐఈ’ అంచనాలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. వ్యాపారుల్లో ఆత్మవిశ్వాసం కొడిగట్టింది. వినియోగదారులు బొత్తిగా జేబుల్లోంచి డబ్బు తీయని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా దేశాల మధ్య వాణిజ్య పోటీతత్వానికి కీలక ప్రాతిపదికగా పరిగణించే ఎగుమతుల వృద్ధి కోసుకుపోయింది. ఉత్పత్తి వృద్ధిలోనూ పాయింట్లు తగ్గాయి. చుట్టూ సమస్యలు మోహరించిన వేళ మౌలికరంగ పెట్టుబడుల ప్రణాళిక క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు తీసుకురానుందన్నది ఆసక్తికరమే. ఆర్థిక వ్యవస్థలో ఆందోళనకర స్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటానికి ఎన్నో కారణాలున్నాయి. మొండిబాకీలు, రుణవితరణ నుంచి బ్యాంకులు వెనక్కి తగ్గడం, ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం, కార్పొరేట్ల రుణ పరిమితులు వంటివి ఆర్థిక మందగమనానికి కారణాలు. ఆర్థిక మాంద్యం దేశంలో పెట్టుబడులు, ఉద్యోగిత కల్పన, ప్రజల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మౌలికరంగానికి పెట్టుబడుల మద్దతు అనే ‘ఇంజక్షన్’ ఇవ్వకుంటే వృద్ధి రేటు మరింత కనిష్ఠానికి పడిపోతుందన్నది కాదనలేని వాస్తవం.
- రేణు కొహ్లీ (రచయిత్రి- ఆర్థిక రంగ నిపుణులు)