దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీపై రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. 'గ్రీన్ షూట్'గా పిలుస్తున్న ఆర్థిక పునరుజ్జీవనాన్ని ఆయన యాంత్రికమైన చర్యగా పేర్కొన్నారు. సంక్షోభం తర్వత ఇలా వృద్ధి పెరగటం సహజమేనని.. దానర్థం అనిశ్చితులు పూర్తిగా తొలగిపోయినట్లు కాదని స్పష్టం చేశారు.
కరోనా విజృంభణతో భారత ఆర్థిక తీవ్ర వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందని ఆయన తెలిపారు. కరోనాకు ముందు కూడా దేశ వృద్ధి అంతంత మాత్రంగానే ఉందన్నారు. 2017-18లో వాస్తవిక జీడీపీ రేటు 6.1 శాతంగా ఉండగా.. అది 2018-19లో 4.2 శాతానికి పరిమితమైనట్లు గుర్తు చేశారు.
స్వల్ప, మధ్య కాలం పరంగా చూస్తే.. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఇంకా ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు సుబ్బారావు. కరోనాతో నెలకొన్న పరిస్థితులతో ద్రవ్యలోటు భారీగా పెరుగుతుందని.. అప్పులు కూడా అంచనాలకు మించి పెరుగుతాయని అన్నారు. దీనితో ఆర్థిక రంగం ఆస్థిరతలు ఎదుర్కోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ద్రవ్యలోటు
భారత ద్రవ్యలోటు 2020-21 జీడీపీలో 6.6 శాతానికి పెరగొచ్చని ప్రపంచ బ్యాంక్ ఇటీవలి అంచనాల్లో తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది 5.5 శాతానికి చేరొచ్చని పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్వవ్యలోటు 3.5 శాతంగా ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేయడం గమనార్హం.
గ్రామీణ ప్రాతాల్లో వృద్ధి..
ప్రస్తుత సంక్షోభంలో ఏదైనా సానుకూల విషయం ఉందంటే.. అది గ్రామీణ ప్రాంతాల వృద్ధేనన్నారు సుబ్బారావు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాల కన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి మెరుగ్గా కోలుకుంటుందని చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవసరమైన వారిని.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఆదుకుందని అన్నారు.
ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు..
ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అవసరమైన స్థాయిలో ప్రభుత్వం ఖర్చు చేయడం లేదన్న విమర్శలతో పరోక్షంగా ఏకీభవించారు సుబ్బారావు. ఈ దశలో ప్రభుత్వం రుణాలు తీసుకుని, ఖర్చు చేయడం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.
"స్వల్పకాలంలో వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వ వ్యయం పెంచడం ఎంతో కీలకం. వృద్ధికి ఊతమిచ్చే ఇతర అంశాలైన ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు ప్రస్తుతం సానుకూలంగా లేవు."
- దువ్వూరి సుబ్బరావు, ఆర్బీఐ మాజీ గవర్నర్
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో సార్వత్రిక కనీస ఆదాయం (యూబీఐ) విధానం మంచిదే అయినప్పటికీ.. ఇది పూర్తిగా మేలు చేస్తుందని చెప్పలేమన్నారు సుబ్బారావు.
ఇదీ చూడండి:కరోనా కాలంలో క్రెడిట్ కార్డు వాడాలా వద్దా?