బ్యాంక్లు ఎవరికైనా రుణాలిచ్చేందుకు.. క్రెడిట్ స్కోరును పరిశీలిస్తాయి. ఈ స్కోరును బట్టే ఆ వ్యక్తికి రుణామివ్వాలా? వద్దా? అనే నిర్ణయానికి వస్తాయి బ్యాంక్లు. మంచి స్కోరు ఉన్న వారికి రుణాలిచ్చేందుకు మొగ్గు చూపుతుంటాయి.
ప్రభావితం చేసే అంశాలు..
- తీసుకున్న రుణ పరిమితి
- రిపేమెంట్ హిస్టరీ
- క్రెడిట్ కార్డు ఉపయోగించుకునే తీరు
- రుణం రకం
- క్రెడిట్ కార్డుల సంఖ్య
ఆదాయం తగ్గితే స్కోరూ తగ్గుతుందా?
లాక్డౌన్లో చాలా మందికి ఆదాయాలు తగ్గిపోయాయి. అయితే ఈ ప్రభావం క్రెడిట్ స్కోరుపై ఉంటుందని చాలా మంది అనుకుంటుంటారు. ఆదాయం అనేది క్రెడిట్ స్కోరుపై ప్రత్యక్షంగా ప్రభావం చూపదు. రుణంతో పాటు క్రెడిట్ కార్డుకు అర్హత సాధించటంలో ఇది కీలకం.
ఆదాయం, వేతనం అనేది ఒక వ్యక్తి రుణాన్ని తిరిగి చెల్లించే శక్తిని సూచిస్తాయి. ఆదాయం తగ్గినప్పటికీ ఈఎంఐలు సరైన సమయంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోరుపై ఎలాంటి ప్రభావం పడదు.
మారటోరియంతో స్కోరు తగ్గుతుందా?
ఆదాయం తగ్గిపోవటం వల్ల రిజర్వు బ్యాంక్ ప్రకటించిన మారటోరియం వెసులుబాటును చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. దీనివల్ల క్రెడిట్ స్కోరు తగ్గిపోతుందనే సందేహం కొంత మందికి ఉంది. అయితే మారటోరియం సదుపాయం ఉపయోగించుకుంటే క్రెడిట్ స్కోరుపై ఎలాంటి ప్రభావం ఉండదు.
మారటోరియం వల్ల రుణాలపై వడ్డీ మాత్రం జమ అవుతుంది. దీనివల్ల రుణ భారం పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో రుణ లభ్యతను ప్రభావితం చేయొచ్చు. ఇందుకోసం క్రెడిట్ రిపోర్టును క్రమంగా పరిశీలిస్తూ ఉండాలి.
రుణరహితంగా ఉంటే స్కోరు బాగున్నట్లేనా?
రుణం తీసుకోనట్లయితే మంచి క్రెడిట్ స్కోరు ఉందన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ రుణం లేనట్లయితే అసలు క్రెడిట్ స్కోరు అనేదే ఉండదు. రుణాన్ని ఏ విధంగా చెల్లిస్తున్నారు? సరైన సమయానికి చెల్లిస్తున్నారా? లేదా? తదితర విషయాలను క్రెడిట్ రిపోర్టు విశ్లేషిస్తుంది. ఒకవేళ రుణం తీసుకోనట్లయితే అసలు విశ్లేషించేందుకు అవకాశమే లేకుండా పోతుంది. మునుపెన్నడూ రుణాలు తీసుకోనట్లయితే భవిష్యత్తులో రుణాలు తీసుకోవటం కష్టం అవుతుంది.
రుణాలు ఎక్కువైతే..
ఎక్కువ రుణాలున్నట్లయితే క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటుందని అనుకుంటుంటారు కొంతమంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే.. తీసుకున్న రుణానికి సంబంధించి తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టే క్రెడిట్ స్కోరు ఆధారపడి ఉంటుంది. ఎన్ని రుణాలు తీసుకున్నామన్నదానికి దీనితో సంబంధం లేదు.
క్రెడిట్ ఎంక్వైరీల వల్ల మాత్రం క్రెడిట్ స్కోరు ప్రభావితం అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ రుణాలు తీసుకుని సరైన సమయంలో తిరిగి చెల్లించినట్లయితే.. తక్కువ రుణాలు తీసుకున్న వారికంటే మంచి క్రెడిట్ స్కోరు ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో రుణాలు తీసుకున్నట్లయితే… తిరిగి చెల్లించే సామర్థ్యం తగ్గిపోయే అవకాశాలు లేకపోలేదు.
క్రెడిట్ కార్డులు ఎక్కువుంటే?
ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే క్రెడిట్ స్కోరు బాగుంటుందన్న భావనతో కొందరు ఉంటారు. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే.. ఎక్కువ క్రెడిట్ అందుబాటులో ఉంటుంది. దీనితో వాటి యుటిలైజేషన్ తగ్గిపోతుంది. దీనితో క్రెడిట్ స్కోరు ప్రభావితం అవుతుంది. ఎక్కువ క్రెడిట్ కార్డులున్నట్లయితే చెల్లింపు తేదీలు వేర్వేరుగా ఉండటం వల్ల వాటిని మరిచి పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
క్రెడిట్ రిపోర్టు రెండు మూడు సంవత్సరాల బిల్లులను విశ్లేషిస్తుంది. ఈ సమయంలో చెల్లించిన రుణాలన్ని క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపిస్తాయి. పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించిన రుణ ఖాతాలు క్రెడిట్ రిపోర్టులో ఉంటాయి.
ఇదీ చూడండి:వాట్సాప్లో ఆ మెసేజ్లను నమ్మితే అంతే...