దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ఆంక్షలు కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ఎనిమిది రాష్ట్రాలు జీడీపీలో 60 శాతానికిపైగా వాటా కలిగి ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది. ఆంక్షలు ఇలాగే కొనసాగితే ఆర్థిక పరిస్థితి మరింత పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దేశం మొత్తంలో దాదాపు 58 శాతం ఉపాధి అవకాశాలు.. మహరాష్ట్ర, గుజరాత్, తమిళనాడుతో సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నట్లు జాతీయ రేటింగ్ ఏజెన్సీ పరిశోధన బృందం తెలిపింది. కేంద్రం ఉద్దీపనలు ప్రకటించినప్పటికీ.. జీడీపీ 5 శాతం వరకు తగ్గే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆ రంగాలకు భారీ నష్టం...
మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు పారిశ్రామిక, సేవా రంగాలపై నుంచి వచ్చే ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. లాక్డౌన్ పొడిగింపుతో.. ఆయా రంగాలు తీవ్ర నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలకు ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. పెట్రోలియం, లిక్కర్ వంటి ప్రధాన ఆదాయ వనరులపై ఈ రాష్ట్రాలు ఆధారపడాల్సి ఉంటుందని వివరించారు.
ఈ ఎనిమిది రాష్ట్రాల్లో వ్యవసాయంలో 64 శాతం, పారిశ్రామిక రంగం నుంచి 63, సేవా రంగంలో 53 శాతం మేర రాష్ట్ర స్థూల విలువ జోడింపు(జీఎస్వీఎ) వాటా కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది.
ఆ రాష్ట్రాలకూ తప్పదు ఆర్థిక భారం...
వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఆంక్షలతో ఆర్థిక కష్టాలు తప్పవని విశ్లేషకులు తెలిపారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో రానున్న రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తుందని భావిస్తున్నారు నిపుణులు.
పెరుగుతున్న కేసులు...
ఇటీవలె మే 31 వరకు లాక్డౌన్ను పొడిగించింది కేంద్రం. గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్ల నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. అయితే, మహారాష్ట్ర వంటి ప్రభావిత రాష్ట్రాలు ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించాయి. తొలి రెండు లాక్డౌన్ కాలంలో అన్ని రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ.. మూడు, నాలుగు దశల్లో భారీగా కేసులు నమోదయ్యాయి.