భారత్‌కు చైనా ఓ సరిహద్దు దేశం మాత్రమే కాదు. వాణిజ్య పరంగా ఎంతో ముఖ్యమైన దేశం కూడా. ఇరుదేశాల మధ్య ఏటా పెద్ద మొత్తంలో ఎగుమతి, దిగుమతులు జరుగుతుంటాయి. అయితే చైనాలో ప్రస్తుతం కొవిడ్-19 (కరోనా) వేగంగా విస్తరిస్తోంది. ఈ ప్రభావం భారత ఎగుమతులపై పడింది. ప్రమాదకర వైరస్ కారణంగా భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడం ఆపేసింది చైనా. వీటితో పాటు మరెన్నో రంగాల ఉత్పత్తుల ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడింది.
కొవిడ్-19 కారణంగా భారత్ ఎదుర్కొనే కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు ఇప్పుడు చూద్దాం.
వ్యవసాయ రంగం
భారత మిర్చి, పత్తి పంటలకు చైనా నుంచి అధిక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి పండు మిర్చి, మహారాష్ట్ర నుంచి పత్తి ఎక్కువగా చైనాకు ఎగుమతి అవుతాయి. వైరస్ కారణంగా ప్రస్తుతం వీటి ఎగుమతి ఆగిపోయింది.
సాధారణంగా చైనా నుంచి డిమాండు ఉన్నప్పుడు మిర్చి రైతులు క్విటాల్‌కు రూ.17,000 నుంచి రూ.20,000 వరకు ఆదాయం పొందుతారు. అయితే ఇప్పుడు డిమాండు లేక క్వింటాల్ మిర్చి ఆదాయం రూ.10,000 నుంచి రూ.12,000కు పడిపోయింది.
చైనా నుంచి డిమాండ్ లేకపోవడం కారణంగా మహారాష్ట్ర పత్తి రైతులూ ఆందోళన చెందుతున్నారు.
వాహన రంగం
భారత ఆటోమొబైల్ పరిశ్రమ విడిభాగాల అవసరాలను 10 నుంచి 30 శాతం వరకు చైనా నుంచి తీర్చుకుంటోంది. చైనాలోని వుహాన్ నగరం ఆటోమొబైల్ హబ్‌గా పేరుపొందింది. అయితే కరోనా వైరస్ ప్రభావం ఆ ప్రాంతంలోనే అధికంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ కారణంగా రానున్న కొన్ని వారాలు, నెలల్లో ఆటోమొబైల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి.
ఎలక్ట్రానిక్స్..
ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్స్ కంపెనీలపై కరోనా పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో ఈ ప్రభావం ఉంటుంది.
భారత్ మొబైల్ పరిశ్రమ ఏడాదికి దాదాపు రూ.95,000 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్లను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల్లోనూ వుహాన్ నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఫలితంగా ఈ పరిశ్రమపైనా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఔషధ పరిశ్రమ..
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో దాని ప్రభావం ఎలా ఉండబోతుందనే అంశాన్ని భారత ఔషధ పరిశ్రమలు నిత్యం పర్యవేక్షిస్తున్నాయి.
భారత్ అధికమొత్తంలో బల్క్ డ్రగ్స్ (యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియంట్స్-ఏపీఐ)ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,405.42 మిలిన్ డాలర్ల విలువైన డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంది భారత్. ఇందులో చైనా వాటానే 67.56 శాతంగా ఉండటం గమనార్హం. ఔషధ పరిశ్రమపైనా వైరస్ ప్రభావం ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
విమానయాన రంగం
భారత్-చైనా మధ్య ప్రస్తుతం విమానయాన సేవలు నిలిచిపోయాయి. చైనా సరిహద్దు దేశాలకు కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా భారత విమానయాన సంస్థలు హాంకాంగ్, సింగపూర్ సహా పలు దేశాలకు విమాన సేవలపై ఆంక్షలు విధించాయి.
భారత ప్రభుత్వం చైనా పర్యటకులకు, సరిహద్దు దేశాలకు ఈ-వీసా సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయాలతో దేశ పర్యటక, ఆతిథ్య రంగాలపై ప్రభావం కనిపించే అవకాశముంది.
ఇదీ చూడండి:ఆన్లైన్లో ఆర్డర్ చెయ్.. ప్రత్యక్షంగా వెళ్లి కొనేయ్!