"కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి"... దాదాపు ప్రతి సంవత్సరం వినిపించే వార్త. ఈసారీ అలాంటి ప్రమాదమే పొంచి ఉంది. ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలే అందుకు కారణం.
లోటు వర్షపాతం నమోదైనా... నిత్యవసరాల ధరలు కట్టడి చేసే ప్రయత్నాలు ప్రారంభించింది కేంద్రం.
అధికంగా ధరలు పెరిగేందుకు అవకాశం ఉండే ఉల్లి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది ఆహార మంత్రిత్వ శాఖ. ఈ సూచనలకు అనుగుణంగా జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (ఎన్ఏఎఫ్ఈడీ) గుజరాత్, మహారాష్ట్రాలో ఉల్లి కొనుగోళ్లు ప్రారంభించింది.
"మేము వారిని అధికమొత్తంలో ఉల్లి కొనుగోలు చేయాలని అడిగాం. కచ్చితంగా 50,000 టన్నులపైనే నిల్వ ఉంచాలని సూచించాం."
- ఏకే శ్రీవాత్సవ, వినియోగదారు వ్యవహారాల శాఖ కార్యదర్శి
మార్కెట్లో ఉల్లి లభ్యత తగ్గినప్పుడు ధరల కట్టడికి ఈ బఫర్ నిల్వలు వినియోగించనున్నట్లు శ్రీవాత్సవ తెలిపారు.
గత అనుభవాలే ఇందుకు కారణం
2017లో ఉల్లి సహా ఇతర కూరగాయల లభ్యతలేమి కారణంగా ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైంది. ఫలితంగా కిలో ఉల్లి ధర రూ.60 దాటింది.
ధరలు అదుపు చేయలేకపోయామని అప్పుడు కేంద్ర ఆహార మంత్రి బహిరంగంగానే నిస్సహాయత వ్యక్తంచేశారు. ఉల్లి సేద్యం తగ్గడం, వ్యాపారులు అధిక నిల్వలు తమ వద్ద ఉంచుకోవడమే ఇందుకు కారణమని తెలిపారు.
సాగు తగ్గే అవకాశం..
ఈ ఏడాది రైతులు ఉల్లి సాగును తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఉల్లికి గిట్టుబాటు ధర దక్కకపోవడమే ఇందుకు కారణం. ఆసియాలోనే అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో ఉల్లి ధర 2018లో క్వింటాల్‌కు రూ.100 నుంచి రూ.300 మేర తగ్గినట్లు గణాంకాల ద్వారా వెల్లడైంది.
భారీగా కందిపప్పు నిల్వలు
కందిపప్పు ధరలు అదుపులో ఉండి తీరతాయని కొత్త ప్రభుత్వంలోనూ ఆహార మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రామ్ విలాస్ పాసవాన్ తెలిపారు. మంత్రిత్వ శాఖ వద్ద 14 లక్షల టన్నులు, ఎన్ఏఎఫ్ఈడీ వద్ద 20 లక్షల టన్నుల కందిపప్పు నిల్వలు ఉన్నట్లు ఆయన చెప్పారు.
ఇదీ చూడండి: ఫోర్బ్స్ జాబితాలో ముగ్గురు భారత సంతతి వనితలు