దేశంలో ప్రభుత్వ వ్యయాలు, ప్రైవేటు వినియోగం క్షీణత దశలో ఉన్నందున.. 2021-22 బడ్జెట్లో మరింత విస్తృతంగా కేటాయింపులు ఉండాలని ఆర్థిక నిపుణులు కేంద్రానికి సూచిస్తున్నారు.
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థలో వినాశనం సృష్టించిందని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు ఎం.గోవింద రావు 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ కారణంగా ప్రజా పరిపాలకు, రక్షణకు, ఇతర సేవలకు ప్రభుత్వ వ్యయాలు జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 12.2 శాతం తగ్గినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ప్రైవేటు తుది వినియోగ వ్యయాలు 54.2 శాతానికి పడిపోయినట్లు వివరించారు.
ఈ గణాంకాలన్నీ ఆర్థిక వ్యవస్థలో బలహీన డిమాండ్‌ను సూచిస్తున్నాయన్న గోవింద రావు.. రానున్న బడ్జెట్లో ఆదాయం, మూలధన వ్యయాలను పెంచడం ద్వారా పోత్సాహమందిచాలని ప్రభుత్వానికి సూచించారు.
ఆదాయం పెంచుకోవచ్చిలా..
వ్యయాలు పెంచేందుకు కావాల్సిన ఆదాయాన్ని రుణాలు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా పొందొచ్చని చెబుతున్నారు గోవింద రావు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మార్గాలను వివరిస్తూ.. ఆర్థిక ఏకీకరణ ప్రణాళికకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు జీడీపీలో 7 శాతంగా సమానంగా నమోదవ్వొచ్చన్నారు.
పద్దు ప్రవేశపెట్టే సమయంలో 2020-21 ద్రవ్యలోటును 3.5 శాతంగా అంచనా వేసింది కేంద్రం.
ద్రవ్య మండలి నెలకొల్పాలి..
బడ్జెటేతర వ్యయాలు పెరుగుతున్నందున.. ద్రవ్యలోటుపై విశ్వసనీయత తగ్గుతున్నట్లు గోవింద రావు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం 'ద్రవ్య మండలి' ఏర్పాటు చేయాల్సి అవసరం ఉందని వివరించారు.
14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్లుగా.. ద్రవ్య మండలిని ఏర్పాటు చేసి పద్దు నిర్వహణ మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండేలా చూడాలని కేంద్రానికి సూచించారు. మండలికి పూర్తి స్వేచ్ఛ ఉండాలని, దీనిని పార్లమెంటు నియమించి, దానికి మాత్రమే నివేదించే విధంగా చూడాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం తలపెట్టిన కార్యకలాపాలకు శాస్త్రీయ పద్ధతిలో ఖర్చులు అంచనా వేయడం, పథకాల వ్యయాలను పారదర్శకంగా మదింపు చేయడం సహా.. పార్లమెంట్‌కు నిష్పక్షపాత నివేదికలు అందించడం ద్రవ్య మండలి ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి:'చిన్న పరిశ్రమలకు కావాలి మరింత చేయూత'