క్రిప్టో కరెన్సీ 'బిట్ కాయిన్' రికార్డులతో దూసుకోపోతోంది. శనివారం దీని విలువ 30,000 డాలర్ల (రూ.21,92,767) మార్క్ దాటింది. ఒకానొక దశలో దీని విలువ 14 శాతం పెరిగి.. 33,136.92 డాలర్లుగా నమోదైంది.
గత నెలలోనే తొలిసారి 20 వేల డాలర్ల స్థాయిని దాటిన బిట్ కాయిన్.. క్రిస్మస్ తర్వాత 25 వేల డాలర్ల మార్క్ అందుకుంది. పది రోజుల్లోపే 30 వేల మార్క్‌ను దాటడం విశేషం. బిట్ కాయిన్ ప్రస్తుత మార్కెట్ క్యాపిటల్ 611 బిలియన్ డాలర్లు (రూ.44.6 లక్షల కోట్లపైమాటే)గా అంచనా.
కరోనా సంక్షోభంలో బంగారంలానే.. క్రిప్టో కరెన్సీనీ మదుపరులు పెట్టుబడులకు సురక్షితంగా భావించడం, పేపాల్ లాంటి దిగ్గజ సంస్థలు క్రిప్టో కరెన్సీను ప్రోత్సహించటం వంటివి బిట్ కాయిన్ విలువ ఈ స్థాయిలో దూసుకుపోయేందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తం మీద 2020లో బిట్ కాయిన్ విలువ 300 శాతానికిపైగా పెరిగింది.
బిట్ కాయిన్ వృద్ధి ఇలా..
సంవత్సరం | నెల | విలువ (డాలర్లలో) |
2011 | ఫిబ్రవరి | 1 |
2011 | జూన్ | 10 |
2013 | ఏప్రిల్ | 100 |
2013 | నవంబర్ | 1,000 |
2017 | అక్టోబర్ | 5,000 |
2017 | నవంబర్ | 10,000 |
2017 | డిసెంబర్ | 15,000 |
2020 | డిసెంబర్ | 20,000 |
2020 | డిసెంబర్ | 25,000 |
2021 | జనవరి | 30,000 |
ఇదీ చూడండి:కోటీశ్వరుడిగా ఎలా మారాలో తెలుసా?