కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కొత్త బ్యాడ్ బ్యాంక్ (మొండి బకాయిల బ్యాంకు) ఒకట్రెండు నెలల్లో ఏర్పాటు కావచ్చని ఆర్థిక సేవల కార్యదర్శి దేబశిస్ పాండా పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన కొత్త డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ (డీఎఫ్ఐ)ను 'నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్' (నాబ్‌ఫిడ్)గా పిలవనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన వారు ఉంటారని వివరించారు. బ్యాడ్ బ్యాంక్‌పై ఆర్బీఐ నియంత్రణ ఉంటుందని వెల్లడించారు.
ప్రభుత్వానికి వాటా ఉండదు..
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తుల(ఎన్పీఏ) సంక్షోభాన్ని బ్యాడ్ బ్యాంక్ సరైన పద్ధతిలో పరిష్కరిస్తుందని ప్రభుత్వ అంచనా వేస్తోంది. ఒత్తిడిలో ఉన్న బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళించుకునేందుకు ఇలా అవకాశం కలుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బ్యాడ్ బ్యాంక్‌లో ప్రభుత్వం పెట్టుబడులూ పెట్టదు, వాటాలూ తీసుకోదని పాండా స్పష్టం చేశారు. కొత్త డీఎఫ్ఐలలో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) విలీనం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రెండు నెలల్లో రూ.10వేల కోట్ల సమీకరణ..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు నెలల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈక్విటీ, డెట్ మిశ్రమ రూపంలో రూ.10,000 కోట్ల వరకు నిధులు సమీకరించాలనే యోచనలో ఉన్నాయని పాండా తెలిపారు. 'ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ.50,700 కోట్ల వరకు సమీకరించాయి. మిగిలిన రెండునెలల్లో రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు సమీకరించగలవ'ని అంచనా వేశారు.
ఇదీ చదవండి: బ్యాడ్ బ్యాంక్ ఎలా పని చేస్తుంది?