కరోనా మహమ్మారి ఎవరూ ఊహించని రీతిలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా 4 దశాబ్దాల్లోనే తొలిసారిగా ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణతను నమోదు చేస్తుందనే అంచనాలున్నాయి. వృద్ధికి ఆలంబనగా నిలవడం, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం, ఉపాధి కల్పనకు ఉపకరించేలా 2021-22 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు.
ఇప్పటికే బడ్జెట్ ముందస్తు (ప్రీ బడ్జెట్) చర్చల్లో వివిధ రంగాల ప్రతినిధుల నుంచి ఆమెకు పలు విన్నపాలు, సూచనలు, సలహాలు అందాయి. సోమవారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఆమె దృశ్యమాధ్యమ విధానంలో మాట్లాడారు. వీటన్నింటి పరిశీలించి, దేశ శ్రేయస్సుకు తోడ్పడే బడ్జెట్ రూపొందించడానికి ఆర్థిక మంత్రి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ బడ్జెట్ క్రతువులో ఆర్థికమంత్రికి సాయం చేసే కార్యదర్శులు, సలహాదార్ల గురించి తెలుసుకుందామా..
అజయ్ భూషణ్ పాండే - ఆర్థిక శాఖ కార్యదర్శి
ఆర్థిక శాఖలోని అయిదుగురు కార్యదర్శుల్లో సీనియర్ సభ్యుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా కొనసాగుతారు. రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ప్రస్తుతం ఈ పదవిలో ఉన్నారు. ఈయన 1984 బ్యాచ్‌కు చెందిన మహారాష్ట్ర క్యాడర్ అధికారి. ఈయన గతంలో యూఐడీఏఐ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పని చేశారు. రెవెన్యూ విభాగాధిపతి కావడంతో వాస్తవిక పన్ను లక్ష్యాల్ని నిర్దేశిస్తుంటారు.ప్రత్యక్ష, పరోక్ష పన్ను విభాగాలు ఈ ఆర్థిక సంవత్సరంలో గట్టిగా దృష్టి పెట్టడంతో కార్పొరేట్ పన్ను, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు కొన్ని నెలలుగా బాగా పెరుగుతున్నాయి. పాండే ఫిబ్రవరి చివర్లో పదవీ విరమణ చేయబోతున్నారు.
కృష్ణమూర్తి సుబ్రమణియన్ - ముఖ్య ఆర్థిక సలహాదారు
ఈయన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 2020-21 ఆర్థిక సర్వేను రూపొందించి, బడ్జెట్‌కు ముందు పార్లమెంటులో ప్రవేశపెడతారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావం ఏ మేరకు పడిందో అందులో వివరించనున్నారు. ఉద్యోగాలు, కార్యకలాపాలు, వివిధ రంగాలు, చిన్న వ్యాపారాలు, గృహస్థులు, విద్యా, ఆరోగ్య సంరక్షణ రంగాలు ఏ స్థాయిలో దెబ్బ తిన్నాయో ప్రభుత్వం దగ్గరున్న సమాచారం ప్రకారం ఆయన వివరిస్తారు.
దేవశిష్ పాండా - ఆర్థిక సేవల విభాగం
ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్ అధికారి ఈయన. ఆర్థిక సేవల విభాగ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. బడ్జెట్‌లో అందరూ ఆశించే ఆర్థిక రంగ ప్రకటనల బాధ్యత ఈయనదే. మూలధన పునర్‌వ్యవస్థీకరణ (రీకేపిటలైజేషన్) ప్రణాళికలు కూడా ఈయనే చూస్తారు. కొవిడ్ పరిణామాలతో ఇతర రంగాలతో పాటు బ్యాంకింగ్ రంగం కూడా బాగా దెబ్బతింది. ఆర్థిక కార్యకలాపాలు మందగించడంతో ఉపాధి కోల్పోయిన వారు రుణాలు చెల్లించలేకపోవచ్చు. ఇది బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను ప్రభావితం చేయనుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (ఆర్‌బీఐ) కలిసి ఈయన పని చేయాల్సి ఉంటుంది.
టీవీ సోమనాథన్ - వ్యయ కార్యదర్శి
ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన సోమనాథన్ 1987 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ అధికారి. ఈయన ప్రస్తుతం వ్యయ కార్యదర్శిగా పని చేస్తున్నారు. 2015 ఏప్రిల్ నుంచి 2017 ఆగస్టు వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయంలో (పీఎంఓ) పని చేశారు. వ్యయ కార్యదర్శిగా వివిధ శాఖల వ్యయాల్లో కోత విధించడం ఈయన పని. కొవిడ్‌పై పోరాటం చేస్తున్న విభాగాల వ్యయాల్లో మాత్రం కోత విధించరని తెలుస్తోంది. ఆర్థికమంత్రి ప్రకటించే ప్రోత్సాహక పథకాలకు నిధులు సమకూర్చడం కూడా ఈయన బాధ్యతే. వచ్చే బడ్జెట్‌లో మూలధన వ్యయాలకు అధికంగా నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.
తరుణ్ బజాజ్ - ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి
పీఎంఓలో అయిదేళ్ల పాటు పని చేసి 2020 ఏప్రిల్‌లో లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక శాఖకు తరుణ్ బజాజ్ వచ్చారు. ఈయన 1988 బ్యాచ్‌కు చెందిన హరియాణా క్యాడర్ అధికారి. ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రకటించిన ఉపశమన చర్యలకు ఒక రూపు తేవడంలో ఈయన కృషి ఎంతగానో ఉంది. తమకు వచ్చే అన్ని వినతుల్ని పరిశీలించి బడ్జెట్ డివిజన్ - బడ్జెట్‌ను రూపొందించిన తరవాత ఈయనకు నివేదిస్తుంది. ఆర్థిక మంత్రి చదివే బడ్జెట్‌ను ఈయన రూపొందిస్తారు.
తుహిన్ కాంత పాండే - దీపమ్ కార్యదర్శి
ఈయన 1987 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ అధికారి. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2020-21) పెట్టుబడుల ఉపసంహరణ (రూ.2.10 లక్షల కోట్ల) ప్రణాళికలకు కొవిడ్ ఆటంకంగా మారింది. 2021-22లోనైనా ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేలా చూడటం ఈయన బాధ్యత. భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), కంటైనర్ కార్పొరేషన్, షిప్పింగ్ కార్ప్, ఎయిరిండియా వంటి సంస్థల్ని ప్రైవేటీకరించడం ఆయన ప్రాధామ్యాలుగా ఉండనున్నాయి. ప్రతిష్ఠాత్మక ఎల్‌ఐసీ ఐపీఓను కూడా తీసుకురావాల్సి ఉంది.
ఇదీ చదవండి : టీకా వికటించి ఎవరూ చనిపోలేదు: కేంద్రం