కంటికి కనిపించని అతి చిన్న వైరస్ కరోనా దెబ్బకు ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతోంది. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి ఇప్పటికే కుదేలైంది. బడా కంపెనీలు, చిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు అన్ని భారీగా నష్టపోతున్నాయి. ఫలితంగా నిరుద్యోగం అధికమవుతోంది. దీంతో వివిధ దేశాలు అమలు చేసే నిరుద్యోగ భృతి ప్రయోజనాలను పొందేందుకు ప్రజలు ఎగబడుతున్నారు.
అగ్రరాజ్యం
కరోనా మరణాలు ప్రపంచంలో అత్యధికంగా నమోదవుతోన్న దేశాల్లో అమెరికా ఒకటి. అయితే అగ్రరాజ్యంలో గడిచిన మూడు వారాలను ఆర్థికవేత్తలు అత్యంత వినాశకరమైన రోజులుగా చెబుతున్నారు. కేవలం మూడు వారాల్లోనే 10 మిలియన్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అక్కడి కార్మిక శాఖ గణాంకాలను విడుదల చేసింది.
ప్రముఖ విమానయాన సంస్థ బోయింగ్ వైరస్ సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయింది. కార్మికుల కోసం స్వచ్ఛందంగా పదవీ విరమణ పథకం ప్రకటించింది.
స్పెయిన్
స్పెయిన్పై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఎన్నడులేని విధంగా మార్చి నెలలో దాదాపు 3 లక్షల 2 వేల265 మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఐరోపావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా జాతీయ నిరుద్యోగ భృతిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులందరికీ చేయూతనిచ్చేందుకు వంద బిలియన్ల యూరోలను ప్రకటించింది ప్రభుత్వం.
ఇదీ చూడండి : వైద్యుల సహృదయం.. రోగికి పుట్టినరోజు వేడుకలు