కొవిడ్-19 ప్రజల ఆరోగ్యాన్నే కాకుండా ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం, సంస్థలు వేతనాలు తగ్గించడం, వ్యాపారాలు మూతపడడం/సరిగ్గా జరగకపోవడం వంటి కారణాలతో చాలా మంది ఆదాయం తగ్గింది. దీంతో తీసుకున్న రుణాలను ఒక ప్రణాళిక ప్రకారం చెల్లించాలనుకున్న వారు కూడా సరైన సమయానికి రుణాలు చెల్లించలేక, ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నారు.
ఇలాంటి ఇబ్బందులను మీరు ఎదుర్కొంటున్నారా? ఇటువంటి పరిస్థితులలో రుణాలను సరిగ్గా నిర్వహించేందుకు ఒక ప్రణాళిక అవసరం. ముఖ్యంగా ఒత్తిడికి గురికాకుండా మనోధైర్యంతో ఉండాలి.
రుణాలు తీర్చే ప్రణాళిక ఎలా ఉండాలంటే..
నిపుణుల అభిప్రాయం ప్రకారం కష్ట సమయంలో రుణాలను తెలివిగా మేనేజ్ చేయాలి. ఇందుకు రెండు స్ట్రాటజీలు ఉన్నాయి. మొదటిది చాలా మంది సాధారణంగా అనుసరించే స్ట్రాటజీ.. వడ్డీ ఆధారంగా రుణాలను రెండు భాగాలుగా విభజించడం. ఈ విధానంలో అధిక వడ్డీ రుణాలను ఒక కేటగిరీకి, తక్కువ వడ్డీ రుణాలను మరొక కేటగిరీలోకి తీసుకుంటారు. ముందుగా అధిక వడ్డీ రుణాలపై దృష్టి సారించాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలలో అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. ముందుగా వీటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీంతో వడ్డీ రూపంలో ఎక్కువ మొత్తం బయటికి పోకుండా ఉంటుంది.
అధిక వడ్డీతో కూడిన రుణాలను ముందుగా తీర్చడం వల్ల చేతిలో ఎక్కువ మొత్తం ఉంటుందని అంచనాలున్నాయి. ఇది కొంత మంది విషయంలో పనిచేస్తుంది.
కానీ మరికొంత మందికి రివర్స్ స్ట్రాటజీ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్ట్రాటజీ ప్రకారం అధిక వడ్డీ రుణాలకు బదులుగా సులభంగా తీర్చగల చిన్న చిన్న రుణాలను ముందుగా క్లియర్ చేయాల్సి ఉంటుంది.
ఉదాహరణకు, ఒక వ్యక్తికి రూ.35 వేల వినియోగ వస్తువుల రుణం(కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్), రూ.1 లక్ష క్రెడిట్ కార్డు రుణం ఉందనుకుందాం. ముందుగా క్రెడిట్ కార్డు రుణానికి బదులు వినియోగ వస్తువుల రుణాన్ని తీర్చాలి. ఈ విధంగా చేయడం వల్ల రుణగ్రహీత మిగిలిన రుణాలను సమర్థవంతంగా నిర్వహించగలడని నిపుణులు చెబుతున్నారు.
టాప్-అప్ రుణాన్ని పరిశీలించవచ్చు..
మీ మిగిలిన అన్ని రుణాలను తీర్చేందుకు తక్కువ వడ్డీతో ఎక్కువ మొత్తం రుణం తీసుకోవచ్చు. ఉదాహరణకు, మీకు కారు, వ్యక్తిగత, క్రెడిట్ కార్డు, గృహ రుణాలు ఉన్నాయనుకుందాం. గృహ రుణం తీసుకున్న బ్యాంకు నుంచి టాప్-అప్ లోన్ తీసుకుని మిగిలిన రుణాలు(కారు, వ్యక్తిగత, క్రెడిట్ కార్డు) క్లియర్ చేయచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర సెక్యూరిటీలలో డిపాజిట్లు ఉన్నవారు వాటిపై రుణాలను పరిశీలించవచ్చు. క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే, తక్కువ వడ్డీకే ఈ రుణాలు లభిస్తాయి.
ఎవరికి ఏ స్ట్రాటజీ?
ఈ రెండు స్ట్రాటజీలలో ఏది మీకు సరిపోతుందో మీరే నిర్ణయించుకోవాలి. ఎక్కువ సంఖ్యలో రుణాలు ఉండి, సరైన సమయంలో తీర్చలేకపోతే భవిష్యత్తులో అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని గుర్తుంచుకోండి. ఒక ప్రణాళిక ప్రకారం తెలివిగా రుణాల తిరిగి చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయండి.
ఇవీ చదవండి: