ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ ప్రాజెక్టు కింద తమ ఫ్లాట్‌ఫాంలో ప్రారంభించిన నిత్యావసర సరకుల పంపిణీ సేవల్ని సెప్టెంబరు 17 నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
సరకుల పంపిణీ కోసం ప్రస్తుతం తాము అవలంబిస్తున్న విధానం ఫలితాలివ్వడం లేదని తెలిపింది జొమాటో. దీంతో వినియోగదారుల అవసరాల్ని సకాలంలో తీర్చలేకపోతున్నామని పేర్కొంది. అలాగే తక్కువ సమయంలో సరకులు అందజేస్తామన్న నియమానికి కట్టుబడడం సాధ్యం కావడం లేదని వెల్లడించింది. పంపిణీ జాబితాలో ఎక్కువ మొత్తంలో సరకులు ఉండడం.. నిల్వ స్థాయిలు తరచూ మారుతుండడం వల్ల సకాలంలో అందించడం వీలుపడడం లేదని వివరించింది.
అయితే, నేరుగా జొమాటో వేదికగా సరకుల పంపిణీని ప్రారంభించడం కంటే.. గ్రోఫర్స్‌లో పెట్టుబడులు పెట్టడం వల్లే తమ కంపెనీలోని వాటాదారులకు లాభదాయకమన్న నిర్ణయానికి వచ్చింది. గ్రోఫర్స్‌లో ఇది వరకే.. దాదాపు రూ.745 కోట్లు పెట్టుబడిగా పెట్టి మైనారిటీ వాటా కొనుగోలు చేసింది జొమాటో.
ఇదీ చదవండి: అంతా రెడీ.. విప్రో ఉద్యోగులు ఇక ఆఫీస్‌కే!