ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో చేసిన ఓ ట్వీట్ అంతర్జాలంలో అందరి మన్ననలు పొందుతోంది. ఇంతకీ విషయమేంటంటే మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్ శుక్లా అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. తన ఫుడ్‌ను డెలివరీ ఇచ్చేందుకు ఓ హిందూయేతర డెలివరీ బాయ్‌ను కేటాయించింది జొమాటో. వినియోగదారుడు మాత్రం తనకు హిందూయేతర వ్యక్తి డెలివరీ చేయోద్దని.. డెలివరీ బాయ్‌ను మార్చమని కోరాడు. అందుకు జొమాటో నిరాకరించింది. డెలివరీ బాయ్‌ను మార్చడం కుదరదని తేల్చిచెప్పింది. వెంటనే ఆర్డర్‌ను రద్దు చేయమని కోరాడు అమిత్ శుక్లా. రద్దు చేసినందుకు అపరాధ రుసుముతో పాటు.. ఎలాంటి రీఫండ్ ఉండదని జొమాటో స్పష్టం చేసింది. అయినా సరే ఫర్వాలేదని అమిత్ రద్దుకే మొగ్గుచూపడం గమనార్హం.
జొమాటో యాప్ ద్వారా జరిగిన ఈ సంభాషణను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అమిత్ శుక్లా.
దీనిపై జొమాటో వెంటనే స్పందించింది. "ఆహారానికి మతం లేదు.. అదే ఒక మతం" అని దీటుగా సమాధానమిచ్చింది.
జొమాటో చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఈ కాలంలో కూడా అమిత్ లాంటి వ్యక్తులు ఉన్నారా? అంటూ మండిపడుతున్నారు.
'విలువలు కోల్పోయే వ్యాపారం చేయం'
విలువలు కోల్పోయే వ్యాపారాలు పోయినా సరే... తాము బాధపడమని జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు.
"భారత్‌లో ఉన్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. మా కంపెనీని విలువలతో నడిపిస్తున్నాము. కస్టమర్లు, భాగస్వాములను ఎంతో గౌరవిస్తాం. విలువలకు భంగం కలిగించే వ్యాపారాన్ని వదులుకున్నప్పుడు మేం అసలు బాధపడం." - దీపిందర్ గోయల్, జొమాటో వ్యవస్థాపకుడు.
'దీపిందర్ గోయల్ మీకు సెల్యూట్'
జొమాటో ఇచ్చిన సమాధానం, సంస్థ అధినేత ట్వీట్‌పై పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.
"మీ యాప్ అంటే నాకు చాలా ఇష్టం. కంపెనీని పొగిడేందుకు మరో కారణాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు."- ఒమర్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్య మంత్రి
"దీపిందర్ గోయల్ మీకు సెల్యూట్. భారత్‌కు మీరు నిజమైన నిదర్శనం. మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాం." -ఎస్.వై.ఖురేషీ, ఎన్నికల సంఘం మాజీ అధ్యక్షుడు
"నేను జొమాటోలో అసలు ఇప్పటివరకు ఆర్డర్ ఇవ్వలేదు. ఇక ఇప్పటి నుంచి జొమాటోలో ఆర్డర్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నా." - చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి
ఇదీ చూడండి: ఆన్లైన్ వీడియో లవర్స్‌కు ఈ డేటా ప్లాన్లు బెస్ట్!