ఐపీఎల్ జరిగినంత కాలం ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించిన అన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో... ఇప్పుడు మరో వినూత్న ఆఫర్ తీసుకొచ్చింది. "జొమాటో ఎలక్షన్ లీగ్" పేరిట దీన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఆఫర్ ఏంటంటే?
దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి.
ఫలితాలు వెలువడే కన్నా ముందే జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసి... ప్రధాని ఎవరవుతారో ఊహించి సమాధానం ఇవ్వాలి. వినియోగదారులు ఊహించిన వారే గెలిస్తే ఫలితాల తర్వాత 30 శాతం క్యాష్ బ్యాక్ ఖాతాలో జమకానున్నట్లు జొమాటో తెలిపింది.
ఒక యూజర్ ఎన్ని సార్లయినా ఆఫర్ పొందొచ్చని ... ఎన్ని సార్లు సరైన సమాధానమిస్తే అన్ని క్యాష్ బ్యాక్లు ఇవ్వనున్నట్లు జొమాటో తెలిపింది.
రేపటి వరకు అవకాశం
ఇప్పటి వరకు దేశంలోని 250 పట్టణాల్లో 3,20,000 మంది "జొమాటో ఎలక్షన్ లీగ్"లో పాల్గొన్నారని... రేపటి (మే 22వ తేదీ) వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది.
ఇలా ఆఫర్లు ఇవ్వడం జొమాటోకి కొత్తేమి కాదు.. ఐపీఎల్ సీజన్లో "జొమాటో ప్రీమియర్ లీగ్" పేరిట క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చింది.