స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో.. కంపెనీల మధ్య ఇటీవల తీవ్ర పోటీ నెలకొంది. ఒక కంపెనీ స్మార్ట్‌ఫోన్ విడుదలవుతుందంటే.. దాదాపు అలాంటి ఫీచర్లతోనే మరో సంస్థ కొత్త మోడల్‌ను విడుదల చేస్తోంది. ఈ పోటీ.. కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ సామర్థ్యం వంటి విషయాల్లో ఎక్కువగా ఉంటోంది.
ఫాస్ట్ ఛార్జింగ్ పోటీ..
ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో.. ఒప్పో, వన్‌ప్లస్, వివో వంటి సంస్థలు ప్రస్తుతం ముందు వరుసలో ఉన్నాయి. ఇవి శాంసంగ్, షియోమీ, యాపిల్ కంపెనీలకు గట్టిపోటీ ఇస్తున్నాయి.
ఆయా సంస్థలను దీటుగా ఎదుర్కొనేందుకు సరికొత్త ఫాస్ట్ ఛార్జింగ్ సాంకేతికతను తీసుకురానున్నట్లు షియోమీ ఇటీవల ప్రకటించింది. చైనాలో జరిగిన సంస్థ డెవలపర్ల సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించింది.
షియోమీ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు..
100 వాట్స్ సూపర్ టర్బోగా పిలిచే.. కొత్త టెక్నాలజీని ఎంఐ ఫోన్లలో తీసుకురానుంది. ఇది వివో అందిస్తున్న 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సాంకేతికతకు పోటీ ఇవ్వనుంది.
కొత్త టెక్నాలజీతో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 17 నిమిషాల్లోనే.. 100 శాతం నిండనున్నట్లు షియోమీ వెల్లడించింది.
వివో ప్రస్తుతం అందిస్తోన్న 120 వాట్స్.. సాంకేతికతలో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని 13 నిమిషాల్లోనే పూర్తిగా నింపుతుండటం గమనార్హం. అయినప్పటికీ షియోమీ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. వివోకు గట్టిపోటీ తప్పదంటున్నాయి మార్కెట్ వర్గాలు.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తున్న వాటిల్లో ఒప్పో 65 వాట్స్ వీఓఓసీ ఛార్జిగ్, రియల్మీ 50 వాట్స్ వీఓఓసీలూ ఉన్నాయి. ఈ రెండు కంపెనీల ఫాస్ట్ ఛార్జింగ్ సాంకేతికతతో.. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని నింపేందుకు వరుసగా.. 25, 33 నిమిషాల సమయం పడుతోంది.
కొత్త ఫోన్లు ఎప్పుడొస్తాయంటే..
ఫాస్ట్ ఛార్జింగ్ కోసం కొత్త టెక్నాలజీని తీసుకురానున్నట్లు ప్రకటించిన షియోమీ.. ఆ ఫీచర్ ఉన్న ఫోన్లు మార్కెట్లోకి ఎప్పుడొస్తాయనే విషయంపై స్పష్టతనివ్వలేదు. 2020 ప్రారంభంలో గానీ.. ప్రథమార్ధంలో గానీ విడుదలయ్యే ఎంఐ ఫ్లాగ్షిప్ ఫోన్లలో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్ ఉండొచ్చని తెలుస్తోంది.
ఇదీ చూడండి:ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో.. ఐటీ ఉద్యోగుల కొత్త భయం!