వర్క్ ఫ్రం హోం సంప్రదాయం బాగా పనిచేస్తోందని.. చాలా వరకు కంపెనీలు కరోనా అంతం తర్వాత కూడా ఈ వ్యవస్థను కొనసాగించవచ్చని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అంచనా వేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్‌లు కొనసాగుతున్న వేళ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయించుకుంటున్న సంగతి తెలిసిందే.
"ఒక్కసారి ఈ మహమ్మారి అంతమయ్యాక.. కార్యాలయాల్లో ఎంత శాతం ఉద్యోగులుండాలి.. అది 20 లేదా 30 లేదా 50 శాతమా అన్నది పునరాలోచించుకుంటారు. చాలా కంపెనీలు తమ ఉద్యోగులు 50 శాతం కంటే తక్కువ సమయమే కార్యాలయాల్లో ఉండేలా ప్రణాళిక రచించుకోవచ్చు. ఇతర కంపెనీలు మాత్రం సాధారణ పద్ధతిలోనే కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంద"ని బిల్‌గేట్స్ అంచనా వేశారు. అయితే సాఫ్ట్‌వేర్‌ను మరింత మెరుగుపరచాలని.. చిన్న ఇళ్లు ఉన్న వారికి ఈ పద్ధతి కష్టమని.. ముఖ్యంగా ఇంటి పని, ఆఫీసు పని చేసే మహిళలకు ఇది ఇబ్బందిగా మారవచ్చని వివరించారు.
"ఈ ఏడాది మొత్తం ఎటూ ప్రయాణాలు చేయలేదు. నాకు మరిన్ని కార్యకలాపాలు నిర్వర్తించడానికి సమయం లభించింది. నిజంగా ఇది నాకు కళ్లు తెరిపించింద"ని గేట్స్ చెప్పుకొచ్చారు.