సంక్షిప్త సందేశాల దిగ్గజం వాట్సాప్ మరో అధునాతన ఫీచర్‌ను తీసుకురానుంది. వాట్సాప్ యూజర్లు అవతలి వ్యక్తికి పంపే సందేశాలు కొంత సేపటి తర్వాత వాటంతటవే డిలీట్ అయ్యేలా ఈ ఫీచర్ పనిచేస్తుందని ఓ టెక్ వార్తా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ బీటా వీ2.19.275 వెర్షన్లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది వాట్సాప్.
కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందంటే...
ఒక వాట్సాప్ యూజర్ మరో వాట్సాప్ యూజర్‌కు సందేశాలు పంపే ముందు తన మెసేజ్ అవతలి వ్యక్తికి ఎంత సేపు కనిపించాలి అనేది ముందుగానే నిర్ణయించొచ్చు. ఇలా ఈ ఫీచర్‌ను ఉపయోగించి పంపిన సందేశాలు 5 సెకన్ల నుంచి గంట వ్యవధిలో వాటంతట అవే డిలీట్ అవుతాయి. తాత్కాలిక అవసరాలకు పంపే సందేశాలకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనుంది.
మొదట ఈ ఫీచర్‌ను బీటా వెర్షన్‌లోని గ్రూప్ చాటింగుల్లో పరీక్షించింది వాట్సాప్. తర్వాత వ్యక్తిగత సంభాషణలకు దీన్ని అందుబాటులోకి తెచ్చింది.
ప్రస్తుతం 'డిలీట్ బోత్' అనే ఫీచర్ ఇంచుమించు ఇలాంటి సదుపాయాలతో అందుబాటులో ఉంది. ఈ సదుపాయం ద్వారా ఒకరికి పంపాల్సిన సందేశం వేరొకరికి పంపినప్పుడు.. లేదా ఏవైనా పొరపాట్లు ఉంటే ఆ సందేశాన్ని పూర్తిగా డిలీట్ చేయొచ్చు. గరిష్ఠంగా సందేశం పంపిన గంటలోపు డిలీట్ బోత్ సదుపాయం వినియోగించే అవకాశముంది. ముఖ్యంగా యూజర్ మాన్యువల్‌గా ఈ సదుపాయం వినియోగించాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: నయా ట్రెండ్: ఆవు పేడ సబ్బు, వెదురు నీటి బాటిల్