ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున చాలా దేశాల్లో లాక్డౌన్ విధించారు. ఈ కారణంగా కోట్లాది మంది ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఇళ్లలో ఉంటున్నవారు తమకు ఇష్టమైన వారితో మాట్లాడేందుకు గ్రూప్ వీడియో కాల్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వినియోగదార్లకు శుభవార్త వినిపించింది వాట్సాప్. ఇకపై ఒకేసారి 8 మందితో వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ చేసి మాట్లాడవచ్చని ఈ ఫేస్బుక్ అనుబంధ సంస్థ తెలిపింది.
"కరోనా నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాట్సప్ ద్వారా వాయిస్ లేదా వీడియో కాల్ చేయడం బాగా పెరిగింది. మరింత ఎక్కువ మందితో మాట్లాడే అవకాశం కావాలని వినియోగదార్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. గతంలో ఉన్న గ్రూప్ వాయిస్, వీడియో కాల్ పరిమితిని రెట్టింపు చేశాం."
-వాట్సాప్ ప్రకటన
ఇలా పొందండి..
ఇప్పటివరకు వాట్సాప్ ద్వారా నలుగురు మాత్రమే వీడియో కాల్ మాట్లాడేవారు. ఇప్పుడు ఆ పరిధిని ఎనిమిదికి పెంచింది సంస్థ. అయితే ఇందుకోసం టెస్ట్‌ఫ్లైట్ నుంచి 2.20.50.25 ఐఓఎస్ బీటా అప్డేట్ను పొందవచ్చు. లేదంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2.20.133 బీటాను పొందాలి.
రెట్టింపైన వినియోగం
లాక్డౌన్ నుంచి వీడియో కాల్స్ వినియోగం పెరిగింది. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా గ్రూప్ వీడియో కాల్స్‌ను 70 శాతం కంటే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అదే విధంగా వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ వాడకం రెట్టింపు స్థాయిలో పెరిగింది.
యాపిల్ అందించే ఫేస్‌టైమ్ వీడియో కాలింగ్ ద్వారా ఒకేసారి 32 మందికి అవకాశం ఉండగా ఫేస్బుక్ మెసెంజర్లో 50 మంది మాట్లాడొచ్చు.
ఇదీ చూడండి: కరోనా దెబ్బకు భారీగా తగ్గిన గూగుల్, ఫేస్బుక్ ఆదాయం