ETV Bharat / business

ఎస్​ బ్యాంకు సంక్షోభం నేర్పే పాఠాలు ఇవే

ఇటీవల దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన ఎస్​ బ్యాంకు సంస్థపై రిజర్వు బ్యాంకు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బున్నా.. కేవలం రూ.50 వేలు మాత్రమే తీసుకునేలా ఆంక్షలు విధించింది. ఫలితంగా బ్యాంకు ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్​​ బ్యాంకు షేర్ల విలువ 85 శాతం వరకు పడిపోయి లక్షలాది మదుపరులు తీవ్రంగా నష్టపోయారు. మరి ఎస్​ బ్యాంకు నేర్పే పాఠాలేంటి? విశ్లేషకులు ఈ పరిణామాలపై ఏమంటున్నారో తెలుసుకుందాం.

what will teach yes bank restrictions to the other bank said experts
ఖాతాదారుల్లో కొరవడుతోన్న నమ్మకం.. యెస్​ బ్యాంకు నేర్పే పాఠాలు
author img

By

Published : Mar 9, 2020, 6:57 AM IST

Updated : Mar 10, 2020, 1:57 PM IST

పారు బాకీలు పెరిగిపోయి, అసలు పెట్టుబడికే దిక్కు లేకపోవడంతో భారత రిజర్వు బ్యాంకు ఏప్రిల్‌ మూడో తేదీ వరకు ఎస్​ బ్యాంకుపై మారటోరియం విధించడం ఖాతాదారులనే కాక ప్రజలందరినీ దిగ్భ్రాంతపరచింది. మారటోరియం అంటే డిపాజిట్ల ఉపసంహరణపై కొంతకాలం పరిమితి విధించడం. దీనివల్ల బ్యాంకు కార్యకలాపాలకు విఘాతం ఏర్పడుతోంది. ఎస్​ బ్యాంకు డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఇవ్వజూపడం, ఆధునిక సాంకేతికత ఆధారిత సేవలు, ఉత్పత్తులను అందించడం వల్ల యువ ఖాతాదారులు విశేషంగా ఆకర్షితులయ్యారు. తీరా ఇప్పుడు ఆ ఆకర్షణలన్నీ కాకి బంగారం మెరుపులని తేలిపోయింది. బ్యాంకులో ఎంత డబ్బు డిపాజిట్‌ చేసినా, ఖాతాదారు తీసుకోగలిగింది రూ.50,000 మాత్రమే. ఈ మారటోరియం లేదా నిషేధం తాత్కాలికమే కానీ, దాని మీద సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు రేగుతోంది. దీంతో ఎస్​ బ్యాంకు షేర్‌ విలువ 85శాతంవరకు పడిపోయి లక్షలాది మదుపరులు తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి అనుమానాలు తలెత్తకుండా చూడటానికి రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినా, ఎస్​ బ్యాంకు పారు బాకీలు పెరిగిపోవడం, మూలధన నిష్పత్తి (సీఏఆర్‌) ఉండాల్సినంత లేకపోవడంతోపాటు నిర్వహణ లోపాలు పెచ్చుపెరిగి ఖాతాదారుల పుట్టి ముంచాయి. సమస్య కేవలం మూల ధనం, నగదు లభ్యతకు సంబంధించినదైతే ముందుగానే గుర్తించి నివారించడం సాధ్యమయ్యేది. అంతకుమించి అవకతవకలు జరగడం వల్లనే పరిస్థితి ఇంతగా దిగజారింది.

లోటుబాట్లే వైఫల్యానికి కారణమా?

ఎస్​ బ్యాంకు 2004లో ప్రారంభమై చాలా శీఘ్రంగా నాలుగో పెద్ద ప్రైవేటు బ్యాంకు స్థాయిని అందుకుంది. సమర్థుల నిర్వహణలో కేవలం 15 ఏళ్లలోనే రూ.3.62లక్షల కోట్ల ఆస్తులు సాధించింది. 2019 మార్చి వరకు కూడా బ్యాంకు సీఏఆర్‌ 15.7 శాతంగా ఉంది. మొత్తం నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 7.39శాతంగా, నికర ఎన్పీఏలు 4.35 శాతంగా లెక్కతేలాయి. ఇవి మరీ తీవ్రమైనవేమీ కావు- ఆర్‌బీఐ నియంత్రణ ప్రమాణాలను పాటించి సరిచేసుకోగల లోటుపాట్లే. వీటిని మించిన అంతర్గత వైఫల్యాలు ఉండబట్టి ఎస్​ బ్యాంకు అధోగతికి జారిపోయింది. 2019 మార్చినాటికి 28 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్​ బ్యాంకుకు వెయ్యికి పైగా శాఖలు, 1,800 ఏటీఎంలూ ఉన్నాయి. బ్యాంకులో మొత్తం రూ.2.27లక్షల కోట్ల డిపాజిట్లు ఉండగా, రూ.2.64లక్షల కోట్ల రుణాలు ఇచ్చింది. ఎస్​ బ్యాంకు ఖాతాదారుల్లో అనేకమంది అతి సంపన్నులు (హెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) ఉన్నారు. 2019 సెప్టెంబరు వచ్చేసరికి ఎస్​ బ్యాంకు డిపాజిట్లు రూ.2.09లక్షల కోట్లకు దిగివచ్చాయి. దాంతో నగదు లభ్యతకు కటకట ఏర్పడింది. ఎస్​ బ్యాంకు పరిస్థితి అనూహ్యంగా, ఆకస్మికంగా దిగజారి, రిజర్వు బ్యాంకు శీఘ్ర దిద్దుబాటు చర్యలకు (పీసీఏ) వ్యవధి లేకుండా పోయింది. సాధారణంగా నాలుగు సందర్భాల్లో రిజర్వు బ్యాంకు పీసీఏకు దిగుతుంది. అవి- బ్యాంకు మూలధనం 10.875 శాతం కన్నా దిగువకు పడిపోయినప్పుడు; నికర అనుత్పాదక ఆస్తులు ఆరు శాతాన్ని మించినప్పుడు; ఆస్తులపై, ముఖ్యంగా ఇచ్చిన రుణాలపై రాబడి వరుసగా రెండు త్రైమాసికాల్లో ప్రతికూలంగా మారినప్పుడు; బ్యాంకు మూలధనానికి, దాని మొత్తం ఆస్తులకు మధ్య నిష్పత్తి 4.5శాతాన్ని మించినప్పుడు రిజర్వు బ్యాంకు పీసీఏ చేపడుతుంది. ప్రస్తుతం యునైటెడ్‌ బ్యాంకు, సెంట్రల్‌ బ్యాంకు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, యూకో బ్యాంకు వంటి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ఐడీబీఐ బ్యాంకు, లక్ష్మీ విలాస్‌ బ్యాంకు కూడా పీసీఏ చట్రంలో ఉన్నాయి.

విశ్వాసం కొరవడితే కష్టమే..

ఎస్​ బ్యాంకుకు అదనపు మూలధనమిచ్చి ఆదుకునే నాథులెవరూ కనిపించడం లేదు. 2019 మార్చినాటికి ఎన్‌పీఏలను రూ.3,277 కోట్ల మేరకు తక్కువ చేసి చూపారు. ఎస్​ బ్యాంకు మాజీ ఎండీ, సీఈఓ రాణా కపూర్‌ పదవీ కాలాన్ని పొడిగించకపోవడం, ఆయనతో పాటు మోర్గన్‌ క్రెడిట్స్‌ ప్రైవేటు సంస్థ వద్ద ఉన్న 5.52కోట్ల వాటాలను అమ్మివేయడం ఎస్​ బ్యాంకు పుట్టి ముంచింది. గతేడాది డిసెంబరులో మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ సంస్థ ఎస్​ బ్యాంకు క్రెడిట్‌ రేటింగ్‌ను తగ్గించేసింది. దీనివల్ల బ్యాంకుకు పొంచి ఉన్న దివాలా ముప్పు ఏమిటో ఆనాడే చూచాయగా తెలిసింది. యాజమాన్య లోపాలే పరిస్థితిని ఈ స్థితికి తీసుకొచ్చాయి. వాస్తవ స్థితిని దాచడం కోసం యాజమాన్యం ఆడిట్‌ ప్రక్రియను గాడితప్పించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణ అధ్వానంగా ఉందని, అవి ప్రైవేటు బ్యాంకుల నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందని పాలక వర్గాలు చేసే వాదనలోని డొల్లతనాన్ని ఎస్​ బ్యాంకు ఉదంతం బయటపెట్టింది. ప్రైవేటు బ్యాంకులంటేనే సమర్థ నిర్వహణకు, లాభాదాయకతకు మారుపేరనే ప్రచారానికి ఈ ఉదంతం గండి కొట్టింది. ఎస్​ బ్యాంకు పాత యాజమాన్యం స్థానంలో కొత్త జట్టు పగ్గాలు తీసుకుంది. ఎస్​ బ్యాంకుకు అయిదు వేల కోట్ల రూపాయల మూల ధనాన్ని అందిస్తున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సారథ్యంలో కొత్త యాజమాన్యం పనిచేస్తుంది. ఏప్రిల్‌ నాలుగో తేదీకల్లా డిపాజిట్‌ దారులకు ఊరట లభిస్తుందంటున్నారు. ఎస్​ బ్యాంకు పరిస్థితిని ముందే గ్రహించి చక్కదిద్ది ఉంటే, సమస్య ఇంతవరకు వచ్చేది కాదు. ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు వేగంగా ఎస్​ బ్యాంకును గాడిలో పెట్టాలి. భారతదేశ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగం పట్ల స్వదేశీ, విదేశీ మదుపరుల్లో విశ్వాసాన్ని నిలబెట్టాలి. ఆర్థిక మాంద్య భయాల మధ్య ఇది తప్పనిసరిగా తీసుకోవలసిన చర్య.

- డాక్టర్‌ కె. శ్రీనివాసరావు

(రచయిత- బీమా రంగ నిపుణులు)

Last Updated : Mar 10, 2020, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.