అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా తమ వినియోగదారులకు గట్టి షాక్ ఇచ్చింది. ఆర్థిక ఒత్తిడి నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి మొబైల్ సేవల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనతో సంస్థకు చెందిన 300 మిలియన్ల కస్టమర్లపై భారం పడనుంది.
" తమ వినియోగదారులు ప్రపంచ స్థాయి డిజిటల్ అనుభవాలను ఆస్వాదిస్తూనే ఉంటారని హామీ ఇస్తున్నాం. 2019, డిసెంబర్ 1 నుంచి సుంకాలకు తగిన విధంగా ధరలను వొడాఫోన్-ఐడియా పెంచనుంది."
- ప్రకటన.
ప్రతిపాదిత ఛార్జీల పెంపు ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత మేరకు పెంచుతున్నారు వంటి విషయాలను వెల్లడించలేదు సంస్థ
క్యూ-2లో భారీ నష్టం..
టెలికాం విభాగానికి బకాయిలు చెల్లించాల్సిందేనని భారత టెలికాం సంస్థలను గత అక్టోబర్లో ఆదేశించింది సుప్రీం కోర్టు. ఈ నేపథ్యంలో రెండో త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను మూట గట్టుకుంది వొడాఫోన్-ఐడియా. సుమారు 50,921 కోట్ల నష్టాలను ప్రకటించింది. రెండో త్రైమాసిక ఫలితాల్లో ఏ భారతీయ కార్పొరేట్ సంస్థ ఇత మేర నష్టాన్ని ప్రకటించిన దాఖలాలు లేవు.
ప్రస్తుతం భారత్లో వొడాఫోన్-ఐడియా వ్యాపారం కొనసాగించగల సామర్థ్యం.. ప్రభుత్వ ఉపశమనాలు, చట్టపరమైన సానుకూల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది సంస్థ.
కొద్దిసేపటికే ఎయిర్టెల్...
డిసెంబర్ 1 నుంచి మొబైల్ సేవల ఛార్జీలు పెంచుతున్నట్లు వొడాఫాన్-ఐడియా ప్రకటించిన కొద్ది సేపటికే ఎయిర్టెల్ కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు డిసెంబర్ నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.
ఇదీ చూడండి: ఆర్థిక మాంద్యమా? అదెక్కడ?... విపక్షానికి కేంద్రం ప్రశ్న