మొబైల్ సేవల దిగ్గజం వొడాఫోన్-ఐడియా తమ నెట్వర్క్ ఇంటిగ్రేషన్ పూర్తయినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా 'వీఐ' పేరుతో కొత్త వైర్‌లెస్ సర్వీసుల బ్రాండును ప్రవేశపెట్టింది. సరికొత్త లోగోను ఆవిష్కరించింది. 'బెటర్ అండ్ బ్రైటర్ టుమారో' పేరుతో కొత్త స్లోగన్ తెచ్చింది. అయితే నూతన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఇంకా ప్రకటించలేదు.
దేశవ్యాప్తంగా ఉన్న వొడాఫోన్, ఐడియా వినియోగదారులు 'వొడాఫోన్-ఐడియా' ఆప్షన్‌ను ఎన్నుకొని వారి మొబైల్ నంబర్‌కు రీఛార్జ్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటనలో తెలిపింది.
పోటీ...
డిజిటల్ సేవలలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలకు గట్టి పోటీనిచ్చేందుకు వొడాఫోన్- ఐడియా సిద్ధమైంది. ఐడియాతో విలీనం తదుపరి పలు సర్కిళ్లలో సేవలను సమీకృతం చేశాక రెండేళ్లకు సరికొత్త వ్యూహాలను వొడాఫోన్ ప్రకటించింది.
భారీ స్పెక్ట్రమ్
గత రెండేళ్లుగా వొడాఫోన్, ఐడియా బ్రాండ్లను విడిగా నిర్వహిస్తూ వచ్చింది సంస్థ. ఇటీవల కస్టమర్లను కోల్పోతూ వస్తున్న నేపథ్యంలో యూనిఫైడ్ బ్రాండుగా 'వీఐ'ను తీసుకువచ్చింది. తద్వారా మరింత మంది వినియోగదారులను ఆకట్టుకోగలమని కంపెనీ ఆశిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో ఐడియా బ్రాండుకు పట్టుంటే.. పట్టణాలలో వొడాఫోన్ అధికంగా విస్తరించింది. రెండు కంపెనీల విలీన సమయంలో 40.8 కోట్లుగా ఉన్న కస్టమర్ల సంఖ్య తగ్గుతూ వచ్చి తాజాగా 28 కోట్లకు చేరింది.
ఛార్జీల పెంపు ఖాయం!
మొబైల్ సేవల ఛార్జీలు పెరగొచ్చని సంకేతాలిచ్చింది వొడాఫోన్-ఐడియా. కంపెనీ సుస్థిరత, రిటర్నుల సాధన కోసం ఛార్జీల పెంపు తప్పదని అభిప్రాయపడ్డారు ఎండీ, సీఈఓ రవీందర్ టక్కర్. ప్రభుత్వమే చొరవ తీసుకుని కనీస ఫ్లోర్ ప్రైస్ నిర్ణయిస్తే బాగుంటుందని అన్నారు.