బల్క్ ఎస్ఎంఎస్లకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి నూతన నియంత్రణ నిబంధనలు అమలు చేయనుంది టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్). ఈ నేపథ్యంలో కొత్త నిబంధనల అమలు.. సజావుగా సాగేలా చూడాలని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు, ప్రభుత్వేతర సంఘాలకు, నోడల్ ఏజెన్సీలకు లేఖ రాసింది.
వాణిజ్య సందేశాల కోసం తెస్తున్న కొత్త నిబంధనలకు సంబంధించి ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీల మధ్య సమన్వయం కుదుర్చుకుంటూ.. ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్ఐసీ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎన్ఐసీ.. పరిపాలనా విధానాలకు సాంకేతికతను అందిస్తుంటుంది.
సీఐఐ, ఫిక్కీ, నాస్కామ్, సెల్యులార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కాయ్) వంటి సంఘాలు తమ సభ్యులకు కొత్త నిబంధనల గురించి వివరించాలని ట్రాయ్ కోరింది.
ఏమిటి కొత్త నిబంధనలు..
అవాంఛిత, మోసపూరిత సందేశాలకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వినియోగదారులకు వాణిజ్య సందేశాలు పంపే సంస్థలు మెసేజ్ హెడ్డర్, టెంప్లేట్స్‌ను టెలికాం ఆపరేటర్ల వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సదరు సంస్థ నుంచి వచ్చే ఎస్ఎంఎస్ గానీ, ఓటీపీ గానీ అంతకుముందు రిజిస్టరైన వివరాలతో బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా టెలికాం సంస్థలు సరిపోల్చుతాయి. దీన్నే ఎస్ఎంఎస్ స్క్రబ్బింగ్ అంటారు.
ఇదీ చదవండి:కరోనాలోనూ కేఎఫ్‌సీ విస్తరణ- కొత్తగా 30 రెస్టారెంట్లు!