నిత్యజీవితంలో ఉప్పు వాడకం తప్పనిసరి. సాధారణంగా వంటకాల్లో ఉప్పు కచ్చితంగా వినియోగించాల్సి వస్తుంది. అయితే.. ఇక మీదట ఉప్పు వాడకంలో జాగ్రత్త వహించాల్సిందే అంటున్నారు అమెరికా పరిశోధకులు.
భారత దేశంలో విక్రయించే అయోడైస్డ్ ఉప్పులో.. హానికరమైన, క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తెలిపింది అమెరికాలోని ఓ ప్రయోగశాల. టాటా, సాంబార్ రిఫైన్డ్ సాల్ట్ వంటి ప్రీమియం బ్రాండ్లలో మోతాదుకు మించి.. పొటాషియం ఫెర్రో సైనైడ్ వినియోగిస్తున్నారని అమెరికా సంస్థ పరిశోధనలో వెల్లడైనట్లు తెలిపారు 'గోధుమ్' ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ ఛైర్మన్ శివ్‌కుమార్ గుప్తా.
అమెరికా ప్రయోగశాల నివేదికను పోల్చుతూ ప్రభుత్వంపై ఆరోపణలు సంధించారు. ఉప్పు తయారీలో దేశంలో సరైన నాణ్యతా ప్రమాణాలు లేవని, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
ఉప్పులో ప్రమాదకర, విషపూరిత పొటాషియం సైనైడ్ స్థాయికి మించి ఉంటోందని పేర్కొంది అమెరికన్ వెస్ట్ అనాలైటికల్ లాబొరేటరీస్. కిలో టాటా సాల్ట్‌లో 1.85 మిల్లీ గ్రాములు, టాటా సాల్ట్ లైట్లో 1.90 మి.గ్రా.ల మేర సైనైడ్ పరిమాణం ఉంటే.. సాంబార్ రిఫైన్డ్ సాల్ట్‌లో 4.71 మిల్లీ గ్రాములుగా ఉంటోందని స్పష్టం చేసింది.
సురక్షిత ఉప్పు తయారీ కోసం పోరాటం..
ప్రపంచవ్యాప్తంగా పొటాషియం ఫెర్రోసైనైడ్ ఉప్పులో వాడేందుకు అనుమతి ఉన్నా.. స్థాయికి మించి ఉండొద్దని పేర్కొన్నారు గుప్తా. హానికర పదార్థాలను వాడకూడదని, సురక్షిత, ఆరోగ్యవంతమైన సహజ పద్ధతులలో ఉప్పును తయారుచేయాలని ఓ ఉద్యమం ప్రారంభించారు గుప్తా.
''భారత్‌లోని ప్రముఖ సంస్థలు పరిశ్రమల వ్యర్థాలు, విషపూరిత రసాయనాలైన అయోడిన్, సైనైడ్ వంటి వాటిని తయారీ, శుద్ధి చేసేందుకు ఉపయోగిస్తున్నాయి. వీటి వల్ల క్యాన్సర్, అధిక రక్తపోటు, ఊబకాయం, కిడ్నీలు పాడైపోవడం వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.''
- శివ్‌కుమార్ గుప్తా, 'గోధుమ్' ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ ఛైర్మన్
దేశంలోని ప్రముఖ ఉప్పు తయారీ పరిశ్రమలు.. శుద్ధి చేసిన ఉప్పును ఎలా ఉత్పత్తి అవుతుందనేది పరీక్షించే 'ఎఫ్ఎస్ఎస్ఏఐ' లైసెన్స్ తీసుకోకుండానే ఉత్పత్తి చేస్తున్నాయని ఆరోపించారు. అదే విధంగా ఉప్పులో సైనైడ్ పరిమాణాన్ని తెలుసుకునే ప్రయోగశాలలు దేశంలో లేవని ఆక్షేపించారు.