గతంలో పెట్టుబడి పెట్టాలంటే నిపుణుల సలహాలు మాత్రమే పాటించేవాళ్లు. అయితే ఇప్పుడంతా ఇంటర్నెట్ ప్రపంచం. ఎలాంటి సమాచారమైనా అంతర్జాలంలో విరివిగా దొరుకుతోంది. ఇందులో పెట్టుబడులు, పొదుపు మార్గాల గురించి తెలుసుకునే అవకాశముంది. కాబట్టి ఇతరులు చెప్పే విషయాన్ని.. ఒకటికి రెండు సార్లు విశ్లేషించుకుని నిర్ణయం తీసుకోవచ్చు.
పెట్టుబడులు ఇలా..
వయసును బట్టి పెట్టుబడి పద్ధతులూ మారుతున్నాయి. పాతతరం వాళ్లు.. దీర్ఘకాలం మదుపు చేసి, మంచి రాబడిని సంపాదించాలని ఆలోచిస్తే.. నేటితరం యువత వేగంగా రాబడిని కోరుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో, అత్యున్నత సేవలతో ఉన్న పెట్టుబడి పథకాలు కావాలని భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ డబ్బు గురించి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అంతా తెలుసుకొని మదుపు చేయడం ఎప్పుడూ మంచిదే. యువత చేయాల్సిన పనేమిటంటే.. ఒక పెట్టుబడి పథకం గురించి పూర్తి సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆర్థిక సలహాదారుడిని సంప్రదిస్తే.. వారు సూచించిన పథకాలను ఎంచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆ విషయాలను ధ్రువీకరించుకోవాలి. ఆయా పథకాల్లో ఉన్న ఖర్చులు, పారదర్శకతను గమనించాలి. అప్పుడే మీరు ఎంచుకున్న పథకం మీరు అనుకుంటున్న లక్ష్య సాధనలో ఉపయోగపడుతుంది.
అప్పు చేసి పప్పు కూడు వద్దు..
ప్రస్తుతం చాలా మంది ఉన్నత విద్యకోసం విద్యా రుణం తీసుకుంటున్నారు. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిన వెంటనే చేయాల్సిన పనేంటంటే... ఆ రుణాన్ని తీర్చేయడం. అలా చేయకుండా చాలా మంది విలాసాలకు, వస్తువుల కొనుగోళ్లకు మొగ్గుచూపుతుంటారు. వీటితో పాటు క్రెడిట్ కార్డు, వాహన రుణం వంటివి తీసుకుంటారు. వీటి కారణంగా సమయం గడుస్తున్న కొద్దీ వడ్డీలు పెరిగి రుణాల ఊబిలో చిక్కుకునే ప్రమాదముంది. అందుకే... సాధ్యమైనంత వరకు అప్పులను తీర్చేసి, కొత్త అప్పుల జోలికి వెళ్లకుండా చూసుకోవాలి.
ప్రణాళిక ప్రకారమే ఖర్చులు...
ఖర్చు చేసే ప్రతి రూపాయికీ లెక్క చూపెట్టాలంటే నేటి యువతకు నచ్చదు. కానీ, ఇది తప్పనిసరి అవసరంగా గుర్తించాలి. సంపాదించిన మొత్తంలో మీ తప్పనిసరి ఖర్చులు ముందుగా తీసేయాలి. అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. పదవీ విరమణ తర్వాత నిధి కోసం కొంత పక్కన పెట్టాలి. ఇంకా మీ స్వల్పకాలిక లక్ష్యాలను కూడా చూసుకోవాలి. వీటన్నింటికీ సరిపోగా మిగిలిన డబ్బును మీ ఇష్టానుసారం ఖర్చు చేయండి. క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేయడం ఒక అలవాటుగా మారాలి. చిన్న వయసులో ఉన్నప్పుడు నష్టభయం భరించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈక్విటీ ఫండ్లు లేదా నేరుగా షేర్లలోనూ మదుపు చేయవచ్చు.
మీపై ఆధారపడిన వారికి భరోసా ఇవ్వాలి...
మీ జీవితం సాఫీగా సాగేందుకు మీ తల్లిదండ్రులు తమ జీవితాలను త్యాగం చేసి వారి కోరికలను అదుపు చేసుకుని మీకు కావాల్సినవి సమకూరుస్తారు. కాబట్టి మీ సంపాదన మొదలైన వెంటనే వారి బాధ్యత మీపై వేసుకోవాలి. అదే విధంగా మీ జీవిత భాగస్వామి భరోసా మీదే. వీటన్నింటినీ సమర్థంగా నిర్వహించే సాధనం జీవిత బీమా మాత్రమే.
చిన్న వయసులో బీమా తీసుకోవడం ప్రారంభిస్తే.. ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. వార్షికాదాయానికి 15 రెట్ల వరకూ బీమా ఉండేలా చూసుకోవడం ఎప్పుడూ ముఖ్యమే. మీ ఆదాయం పెరుగుతున్న కొద్దీ బీమా కూడా పెరగాలి.
నేటి ఆధునిక యువత ఒకే ఉద్యోగంలో స్థిరంగా ఉండటం కూడా కష్టమే. అయితే, ఉద్యోగం మారినప్పుడల్లా.. భవిష్య నిధిని వెనక్కి తీసుకోవద్దు. ఉద్యోగం చేస్తున్న చోటకు ఆ ఖాతాను బదిలీ చేసుకుంటూ ఉండాలి. రోజులు మారుతున్న కొద్దీ ఆర్థిక అవసరాలు పెరగుతున్నాయి. వీటన్నింటినీ తట్టుకుని జీవితంలో ముందుకు సాగాలంటే ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానాలు అవసరం. అప్పుడే ఆర్థిక భరోసా మీ సొంతం.
ఇదీ చూడండి: ప్లాన్ ఏదైనా.. వినోదం ఫ్రీ అంటున్న టెల్కోలు!