దేశీయ మొబైల్ రంగంలో టారిఫ్‌ల పెంపు రేపో, మాపో తప్పదనేలా ఇటీవలి వరకు కంపెనీల ప్రకటనలుండేవి. పరిశ్రమ మనుగడ కోసం ఛార్జీల పెంపు తప్పదని, నెట్‌వర్క్ విస్తృతికి ఇది అవసరమని కొంత కాలంగా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రకటిస్తూ వచ్చాయి. అయితే మార్కెట్ లీడర్ రిలయన్స్ జియో ఈ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ సంస్థలు కూడా ఛార్జీల పెంపులో దూకుడు కనబరచలేదు. తమ కంటే నెలవారీ కనెక్షన్ల పెంపులో ఎయిర్‌టెల్ ముందుండటం, దానితో పాటు వొడాఫోన్ ఐడియాకు ఉన్న 2జీ ఫీచర్‌ఫోన్ల వినియోగదారులను ఆకట్టుకునే భారీ ప్రణాళికను జియో ప్రకటించింది. రూ.1,999కే ఫోన్ కూడా ఇస్తూ, రెండేళ్ల పాటు అపరిమిత కాల్స్, డేటా ఆఫర్ ఇవ్వడం ద్వారా ఇప్పట్లో ఛార్జీల పెంపునకు సుముఖంగా లేమనే సంకేతాలు జియో ఇచ్చినట్లయ్యింది. మిగిలిన నెట్‌వర్క్ సంస్థలకు ఇది ఇబ్బంది కరమే అయినా, ప్రస్తుతానికి వినియోగదారులకు మాత్రం ఊరట కలిగించే అంశం.
జియోఫోన్ కథేంటి..
దేశంలో 30 కోట్ల మంది 2జీ వినియోగదార్లను 4జీకి మార్చడమే లక్ష్యమంటూ గతవారం ‘కొత్త జియోఫోన్ 2021’ను రిలయన్స్ జియో విడుదల చేసింది. రెండేళ్ల పాటు అపరిమిత కాల్స్, నెలకు అధికవేగం 2జీబీ డేటా, అనంతరం పరిమిత వేగంతో అపరిమిత డేటా, కొత్త జియోఫోన్‌లను కేవలం రూ.1,999కి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత జియోఫోన్ వినియోగదారులు రూ.749 చెల్లించి ఏడాది కాలానికి అపరిమిత కాల్స్, డేటా సదుపాయాలు పొందొచ్చు. దీంతోపాటు నెలకు రూ.22 నుంచి మరో 5 ప్రీపెయిడ్ పథకాలను కూడా జియోఫోన్ చందాదార్ల కోసం తెచ్చింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 2జీ చందాదార్లు ఇప్పటికీ నెలకు అధికమొత్తాలు చెల్లిస్తున్నారని, వీరికి తక్కువ ఖర్చయ్యే పథకాలతో తమ నెట్‌వర్క్‌కు ఆకర్షించగలమని జియో భావిస్తోంది. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న జియో ఖాతాదారుల వృద్ధి.. జియోఫోన్‌తో మళ్లీ గాడిలో పడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వరుసగా అయిదో నెలలోనూ..
2020 డిసెంబరులో భారతీ ఎయిర్‌టెల్ 40 లక్షలకు పైగా కొత్త ఖాతాదారులను చేర్చుకోగా, జియో 4,78,197 మంది వినియోగదారులనే పెంచుకుంది. ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియా మాత్రం 56.9 లక్షల కనెక్షన్లు కోల్పోయింది. కనెక్షన్ల వృద్ధి పరంగా ఎయిర్‌టెల్ చేతిలో జియో వెనుకంజ వేయడం ఇది వరుసగా అయిదో నెల కావడం గమనార్హం. ఇక డిసెంబరు క్రియాశీల చందాదారులను చూస్తే.. ఎయిర్‌టెల్‌కు 97.1 శాతం, వొడాఫోన్ ఐడియాకు 90.26 శాతం, రిలయన్స్ జియోకు 80.23 శాతమే ఉన్నారు. ఈ గణాంకాలన్నీ కూడా వినియోగదారులను పెంచుకోవడం సహా వారిని క్రియాశీలకంగా అట్టేపెట్టుకోవడంపై జియో దృష్టి పెట్టేలా చేశాయనడంలో సందేహం లేదు.
ఎయిర్‌టెల్, 'వి' పరిస్థితేంటి..
రిలయన్స్ జియో నిర్ణయం భారతీ ఎయిర్‌టెల్ కంటే వొడాఫోన్ ఐడియా (వి)పైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సవరించిన స్థూల బకాయిలు చెల్లించేందుకు, తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొన్న 'వి' దాదాపు మూసివేత వరకు వెళ్లింది. అయితే ఆ గండం నుంచి తప్పించుకున్న కంపెనీ.. ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలతో పోటీపడలేకపోతుంది. భారీ రుణభారానికి తోడు నెట్‌వర్క్ పటిష్ఠతకు కూడా నిధులు కేటాయించలేని స్థితి ఎదురవుతోంది. ఇటీవలి స్పెక్ట్రమ్ వేలంలో కూడా నామమాత్రంగానే వొడాఫోన్ ఐడియా కొత్త స్పెక్ట్రమ్ కొనుగోలు చేయగలిగింది. కొన్ని నెలలుగా 'వి' చందాదారులను గణనీయంగా కోల్పోతూ వస్తోంది. తాజాగా రిలయన్స్ తెచ్చిన జియోఫోన్ ఎక్కువ మంది 2జీ ఖాతాదారులున్న 'వి'కు మరిన్ని చిక్కులు తీసుకురానుంది. ఛార్జీలు పెంపు సమస్యను 'వి'తో పాటు ఎయిర్‌టెల్ ఎలా ఎదుర్కొంటుందో వేచిచూడాల్సిందే.
ఇదీ చదవండి:అక్కడ కనుపాపలే.. పాస్‌పోర్టులు!