ఫైబర్ ఇంటర్నెట్ రంగంలో ధరల యుద్ధానికి తెర లేపింది ఎయిర్టెల్. 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ను అందించేందుకు 'ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్' ప్లాన్‌ను నేడు ఆవిష్కరించింది.
1 జీబీపీఎస్ ఇంటర్నెట్ వేగం సహా వివిధ రకాల ప్లాన్లతో.. జియో ఫైబర్ వాణిజ్య సేవలు ప్రారంభించిన కొన్ని రోజులకే.. ఎయిర్టెల్ ఈ ఆఫర్ విడుదల చేయడం గమనార్హం. ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఫ్యాక్ నెలవారీ చందాను రూ.3,999గా నిర్ణయించింది ఎయిర్టెల్.
"నేటి నుంచి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇళ్లు, చిన్న పరిమాణంలో ఉండే కార్యాలయాలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్, దిల్లీ, ముంబయి, పుణె, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఇండోర్, జైపుర్, అహ్మదాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఛండీగఢ్, ఘజియాబాద్‌లో ఈ సేవలు పొందొచ్చు." -ఎయిర్టెల్
రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది.
జియోలానే.. ఎయిర్టెల్ అదనపు సేవలు
ఫైబర్ సేవల ప్రారంభంలో భాగంగా రిలయన్స్ జియో ప్రకటించినట్లుగానే.. ఎయిర్టెల్ అదనపు సేవలు అందిస్తోంది.
ల్యాండ్‌లైన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. ఎయిర్టెల్ థ్యాంక్స్ వినియోగదారులకు లభిస్తున్న అన్ని రకాల సదుపాయాలు ఎక్స్ట్రీమ్ వినియోగదారులు పొందొచ్చని తెలిపింది.
ఎక్స్ట్రీమ్కు వినియోగదారులు.. మూడు నెలల నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్, ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం సహా జీ5 ప్రీమియం కంటెంట్‌ను ఉచితంగా పొందొచ్చని ఎయిర్టెల్ తెలిపింది.
ఇదీ చూడండి: యాపిల్ దెబ్బకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ విలవిల!