Tax Savings: ఆర్థిక సంవత్సరం 2022, మార్చి 31తో ముగుస్తుంది. చూడ్డానికి మూడు నెలలకు పైగానే సమయం ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, మనం ఆలోచించి, నిర్ణయం తీసుకొని, పెట్టుబడులు పెట్టే సరికి.. ఈ కాలం ఇట్టే గడిచిపోతుంది. అప్పుడు ఆదాయపు పన్ను చెల్లించడం మినహా ప్రత్యామ్నాయం ఉండదు.
భారం ఎంత?
మొత్తం ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం ఎంతమేరకు ఉంటుందనే విషయంలో ఒక స్పష్టత వచ్చే ఉంటుంది. మీ కార్యాలయంలో ఈ వివరాలు అడగండి. దీంతోపాటు మొత్తం పన్ను ఎంత చెల్లించాల్సి వస్తుంది? ఇప్పటికి ఎంత చెల్లించారు? మిగిలింది ఎంత?లాంటి వివరాలూ తెలుసుకోండి. దీనివల్ల ఏయే సెక్షన్ల కింద ఇంకా ఎంత మినహాయింపు పొందేందుకు అర్హులన్నది అవగాహన వస్తుంది. తర్వాత అవసరమైన మేరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవ్వాలి.
పరిమితుల మేరకు..
ముందే అనుకున్నట్లు.. ఏ సెక్షన్ కింద ఇంకా ఎంత మినహాయింపు పొందేందుకు వీలుందో చూసుకోవాలి. సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకూ పరిమితి ఉంటుంది. ఈపీఎఫ్, పీపీఎఫ్, జీవిత బీమా పాలసీలు, ఇంటి రుణం అసలు, పిల్లల ట్యూషన్ ఫీజులు, ఈఎల్‌ఎస్‌ఎస్, పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎన్‌ఎస్‌సీ, కిసాన్ వికాస పత్ర, సుకన్య సమృద్ధి యోజన.. ఇలా అనేక మార్గాల్లో ఈ మొత్తాన్ని మదుపు చేసేందుకు వీలుంటుంది. ఈ పరిమితి పూర్తి కాకపోతే.. దాన్ని భర్తీ చేయొచ్చు. ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి సెక్షన్ 80డీ కింద మినహాయింపు లభిస్తుంది. ఇందులో రూ.25వేల వరకూ మినహాయింపు పొందవచ్చు. తల్లిదండ్రుల పేరుమీద తీసుకున్న పాలసీకి మరో రూ.25వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. వారు సీనియర్ సిటిజన్లయితే.. రూ.50వేల వరకూ పరిమితి ఉంటుంది. దీంతోపాటు.. రూ.5,000 వైద్య పరీక్షల ఖర్చు కోసం చూపించుకోవచ్చు. ఇక్కడ చూసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. అందుబాటులో ఉన్న అన్ని మినహాయింపులనూ వినియోగించుకోవడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవాలి.
గృహ, విద్యా రుణాలుంటే..
మీ కోసం లేదా మీ పిల్లల కోసం విద్యారుణం తీసుకొంటే దానికి చెల్లించే వడ్డీకి పూర్తి మినహాయింపు సెక్షన్ 80ఈ కింద పొందవచ్చు. ఈ రుణానికి వడ్డీ చెల్లించకపోతే.. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు చెల్లించేందుకు ప్రయత్నించండి. ఇక ఇంటి రుణం తీసుకున్నప్పుడు చెల్లించే వడ్డీకి రూ.2,00,000 వరకూ.. అసలుకు సెక్షన్ 80సీ పరిమితి మేరకు మినహాయింపు లభిస్తుంది.
దీర్ఘకాలిక మూలధన లాభం..
ఏడాదికి మించి కొనసాగిన ఈక్విటీ పెట్టుబడులను విక్రయించడం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి లాభం వచ్చిందనుకోండి. అప్పుడు ఆ అదనపు మొత్తానికి 10 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి లాభం రావచ్చు అనుకున్నప్పుడు.. ఆ దీర్ఘకాలిక షేర్లను విక్రయించి, మర్నాడు వెంటనే వాటిని కొనే ప్రయత్నం చేయొచ్చు. దీనివల్ల కొంత మేరకు పన్ను భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది కాస్త క్లిష్టమైన వ్యవహారమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.
లక్ష్యం సాధించేలా..
కేవలం పన్ను ఆదా కోసమే పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనా సరికాదు. మీ ఆర్థిక లక్ష్యాలు నిర్ణయించుకొని, అందుకు అనువైన విధంగా మదుపు ప్రణాళిక రూపొందించుకోవాలి. పన్ను ఆదా అనేది ఒక అదనపు ప్రయోజనంగానే ఉండాలి. ఇప్పటికే ఉన్న మీ పెట్టుబడులను ఒకసారి తిరిగి సమీక్షించుకోండి. ఆ తర్వాతే కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించండి.
ఇవీ చూడండి: Wealth Creation Tips: సంపద సృష్టికి 'ఏబీసీడీ' పొదుపు మంత్రం..