ప్రస్తుత కరోనా కాలంలో వ్యాపార రంగం నష్టాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో పలు దిగ్గజ వ్యాపార సంస్థలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ నగదుగా మారుస్తున్నాయి. ఆ మొత్తాన్ని వ్యాపార మూలధనంగా ఉపయోగిస్తున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా పెట్టుబడులను నగదుగా మార్చేది లేదని ప్రకటించింది భారతీయ వ్యాపార దిగ్గజం టాటా సన్స్. మూలధనం కోసం పెట్టుబడులను నగదు రూపంలోకి మార్చబోయేది లేదని వెల్లడించింది. తమవద్ద సరిపోయినంత నగదు నిల్వలు ఉన్నట్లు చెప్పింది. ఈ మేరకు సంస్థ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రకటన విడుదల చేశారు.
"టాటా సన్స్ ఆర్థికంగా బలమైన స్థితిలో ఉంది. గ్రూప్ కంపెనీలకు మద్దతుగా నిలిచేందుకు, నూతన అభివృద్ధి ప్రణాళికలను అమలు చేసేందుకు తగినన్ని నగదు నిల్వలు ఉన్నాయి."
-ఎన్. చంద్రశేఖరన్, టాటా గ్రూప్ ఛైర్మన్
లాక్డౌన్ వేళ ఇతర కంపెనీల లాగానే టాటా గ్రూప్‌ను కూడా పలు సవాళ్లు, అవకాశాలు తలుపు తడుతున్నట్లు చెప్పారు. గ్రూప్‌కు చెందిన అన్ని కంపెనీలు.. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటూ, అవకాశాలను అందిపుచ్చుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని చెప్పారు చంద్రశేఖరన్.
సాఫ్ట్వేర్ సహా వివిధ వ్యాపారాలు నిర్వహించే టాటా గ్రూప్‌నకు టాటా సన్స్ మాతృ సంస్థ.
ఇదీ చూడండి: అద్వితీయమే లక్ష్యంగా శ్రమించాల్సిన సమయమిది