దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాలో ఉక్కు ఉత్పత్తి సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు.. గత ఏడాది నుంచే వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాయి.
అధికారిక డేటా ప్రకారం.. గత ఏడాది సెప్టెంబర్ నుంచి 2021 ఏప్రిల్ 22 వరకు 1,43,876.283 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేశాయి ఉక్కు ఉత్పత్తి సంస్థలు.
మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసిన ప్రైవేటు కంపెనీల్లో.. టాటా స్టీల్, ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా(ఏఎంఎన్ఎస్), జేఎస్‌డబ్ల్యూ స్లీల్, జిందాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్, వేదాంత వంటివి ప్రధానంగా ఉన్నాయి.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్), రాష్ట్రీయ ఇస్పాత్ నిగామ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాలో భాగస్వామ్యమయ్యాయి.
ఆయా సంస్థలు ఉత్పత్తి చేసిన ఆక్సిజన్‌ను.. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, బంగాల్, బిహార్, జార్ఖండ్, దిల్లీ, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు అధికంగా సరఫరా చేశాయి.
టాటా స్టీల్ ఒంటరిగా.. వివిధ రాష్ట్రాలకు రోజుకు 300 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.
ప్రభుత్వ రంగ సంస్థలైన సెయిల్, ఆర్ఐఎన్ఎల్ వరుసగా రోజుకు 600 టన్నులు, 100 టన్నుల చొప్పున మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్లు తెలిపాయి.
ప్రభుత్వ అభ్యర్థన మేరకు మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరాలో చేస్తున్న సహాయానికి గానూ.. ఆయా సంస్థలన్నింటికీ కృతజ్ఞతలు తెలిపారు ఉక్కు పరిశ్రమ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.
ఇదీ చదవండి:'యువతరం ఓటు విద్యుత్ వాహనాలకే'