టెక్ దిగ్గజం గూగుల్‌కు దక్షిణ కొరియా ఇంటర్నెట్ నిఘా సంస్థ భారీ జరిమానా విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శాంసంగ్ వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలను ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ (ఓఎస్) వినియోగించేందుకు వీలులేకుండా నిరోధించడాన్ని తప్పుబడుతూ 177 మిలియన్ డాలర్ల (రూ.1300 కోట్ల పైమాటే) జరిమానా విధించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇది నిజమైతే.. దక్షిణ కొరియా యాంటీ ట్రస్ట్ విభాగం విధించిన అతిపెద్ద జరిమానా ఇదే అవనుంది.
టెలికాం చట్టంలో చేసిన సవరణల ఆధారంగా గూగుల్‌కు ఈ స్థాయిలో జరిమానా విధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. యాప్ మార్కెట్‌ను నిర్వహించే గూగుల్, యాపిల్ వంటి ఆపరేటర్లు.. ఇన్ యాప్ పర్చేజింగ్ వ్యవస్థ ద్వారా మాత్రమే యాప్‌ల కొనుగోలుకు చెల్లింపులు చేసేందుకు అనుమతివ్వడాన్ని నిరోధించే విధంగా ఇటీవల చట్టంలో మార్పులు చేసింది దక్షిణ కొరియా. ప్రపంచంలో ఇలాంటి నియంత్రణ చట్టాన్ని అమలులోకి తెచ్చిన తొలి దేశంగా కూడా దక్షిణ కొరియా నిలిచింది.
విదేశీ టెక్ కంపెనీలు తమ దేశంలో నిర్వహించే కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తుంటుంది దక్షిణ కొరియా. ఇందులో భాగంగా మొబైల్ ఇంటర్నెట్ మార్కెట్లో గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు.. గూగుల్, యాపిల్ వంటి సంస్థలపై ఇటీవల ప్రత్యేక దృష్టి సారించింది.
ఇదీ చదవండి: Google Internet Safety: ఇంటర్నెట్ భద్రత కోసం గూగుల్ ఏబీసీలు!