బిట్‌కాయిన్...! అంతర్జాల ఆర్థిక వ్యవస్థలో ఓ సంచలనం. అదే తరహాలో సొంతంగా క్రిప్టోకరెన్సీ తీసుకురావాలని భావించింది ఫేస్బుక్. లిబ్రా కాయిన్ తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఆర్థిక సంస్థలను భాగస్వాముల్ని చేసేందుకు ప్రయత్నించింది.
అయితే... లిబ్రా ప్రాజెక్టు విషయంలో ఫేస్‌బుక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డిజిటల్ కరెన్సీ కూటమి నుంచి పలు కీలక సంస్థలు వైదొలిగాయి. క్రెడిట్ కార్డు సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డు, అంతర్జాల మార్కెట్‌కు చెందిన ఈబే, డిజిటల్ పేమెంట్ సంస్థ స్ట్రైప్, ఇతర సంస్థలు లిబ్రా సంస్థలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాయి.
"లిబ్రా కూటమిలో సభ్యత్వం తీసుకోకూడదని మేము నిర్ణయించుకున్నాం."
-మాస్టర్ కార్డు సంస్థ
లిబ్రా నుంచి ప్రస్తుతానికి వైదొలుగుతున్నామని, భవిష్యత్‌లో చేరే అవకాశముందని సంకేతాలిచ్చింది 'వీసా'.
"ప్రపంచవ్యాప్తంగా సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనకు మా సొంత వ్యూహాలతో పనిచేస్తాం. లిబ్రా వంటి ప్రాజెక్టులతో మాకూ లాభం ఉంటుందని తెలుసు. ఆ ప్రాజెక్టు ఎలా సాగుతుందో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటాం."
-వీసా సంస్థ
"లిబ్రా ప్రాజెక్టు ఎంతో గొప్పది. కానీ ఆ కూటమిలో వ్యవస్థాపక సభ్యునిగా కొనసాగకూడదని ఈబే నిర్ణయం తీసుకుంది."
-ఈబే సంస్థ
డిజటల్ కరెన్సీ కూటమి నుంచి క్రెడిడ్ కార్డు సంస్థలు వైదొలిగినట్లు లిబ్రా సంస్థ ధ్రువీకరించింది. కానీ మరికొన్ని ఇతర సంస్థతో మమేకమై క్రిప్టోకరెన్సీ సేవలను అందించనున్నట్లు తెలిపింది.
ఎందుకిలా...?
ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో నగదు బదిలీ చేసేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో లేనివారికి ఆర్థిక సేవలు అందించేందుకు లిబ్రా కరెన్సీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఫేస్బుక్ చెబుతోంది. అయితే... ఈ ప్రాజెక్టుపై అమెరికా అధికార యంత్రాంగం అనేక అనుమానాలు లేవనెత్తుతోంది. లిబ్రా కూటమిలో భాగస్వాములు అయితే భారీ స్థాయిలో తనిఖీలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తూ అమెరికా సెనేటర్లు కొందరు ఇటీవలే వేర్వేరు ఆర్థిక సంస్థలకు లేఖ రాశారు. ఆ తర్వాతే లిబ్రా ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి.
లిబ్రాపై అమెరికా దిగువ సభలో చేపడుతున్న విచారణకు ఈ నెల 23న ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ హాజరై, తన వాదనలు వినిపించనున్నారు.
ఇదీ చూడండి:సరికొత్త ఫీచర్లతో వన్‌ప్లస్ 7టీ సిరీస్‌లో స్మార్ట్ఫోన్లు