వారాంతం రోజు లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. దేశీయంగా మరిన్ని ఉద్దీపనలు ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల సూత్రప్రాయంగా పేర్కొనడం మార్కెట్లకు కలిసొచ్చింది. బ్రెగ్జిట్ ఒప్పందం ముందుకు సాగటం అంతర్జాతీయంగా సానుకూలతలు పెంచింది. వీటికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలపై సానుకూల అంచనాలు లాభాలకు ఊతమిచ్చాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 246 పాయింట్లు పుంజుకుంది. చివరకు 39,298 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి..11,662 వద్దకు చేరింది.
వారం మొత్తం మీద సెన్సెక్స్ 1,171 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 75 పాయింట్లు ఎగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 39,361 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 38,964 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,685 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,553 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎస్ బ్యాంక్ అత్యధికంగా 8.44 శాతం లాభపడింది. మారుతీ 2.74 శాతం, పవర్ గ్రిడ్ 2.45 శాతం, ఎన్టీపీసీ 2.02 శాతం, ఎల్&టీ 1.67 శాతం, ఎస్బీఐ 1.58 శాతం లాభాలను ఆర్జించాయి.
టాటా మోటార్స్ 1.05 శాతం, బజాజ్ ఆటో 0.69 శాతం, భారతీ ఎయిర్టెల్ 0.65 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 0.64 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.19 శాతం నష్టాలను నమోదు చేశాయి.
రూపాయి, ముడి చమురు..
రూపాయి నేడు స్వల్పంగా పుంజుకుంది. డాలర్‌తో మారకం విలువ ఇంట్రాడేలో 71.13కు చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ నేడు 0.12 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 59.98 డాలర్ల వద్ద ఉంది.
ఇతర మార్కెట్లు ఇలా..
ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు.. చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. జపాన్ సూచీ మాత్రం లాభాలతో నమోదు చేసింది.
ఇదీ చూడండి: క్రమంగా దిగొస్తున్న బంగారం ధర- నేడు ఎంత తగ్గిందంటే...