స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. లాభాల స్వీకరణతో సెషన్ ప్రారంభంలో కాస్త ఒడుదొడుకులకు లోనైనా.. అంతర్జాతీయ సానుకూలతలతో ఐటీ, వాహన రంగ షేర్లు సానుకూలంగా స్పందించి మార్కెట్లను లాభాలవైపు మళ్లించాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 115 పాయింట్లు పుంజుకుని.. చివరకు 41,674 (జీవనకాల గరిష్ఠం) వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 12,260(జీవనకాల గరిష్ఠం) వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,719 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,456 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,268 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,191 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ట్రేడింగ్ ప్రారంభంలో దాదాపు రెండు పాయింట్లకు పైగా నష్టాన్ని నమోదు చేసిన ఎస్ బ్యాంకు.. చివరకు 6.74 శాతం లాభంతో సెషన్‌ను ముగించింది. టీసీఎస్ 2.83 శాతం, టాటా మోటార్స్ 2.55 శాతం, భారతీ ఎయిర్టెల్ 2.35 శాతం, ఎం&ఎం 2.32 శాతం, హీరో మోటార్స్ 2.16 శాతం లాభపడ్డాయి.
వేదాంత 2.26 శాతం, సన్‌ఫార్మా 1.44 శాతం, హెచ్డీఎఫ్సీ 1.34 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.76 శాతం, బజాజ్ ఫినాన్స్ 0.69 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి:100 బిలియన్ డాలర్ల క్లబ్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్