స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. దేశీయ, అంతర్జాతీయ సానుకూల పవనాలతో.. ఆరంభం నుంచే సరికొత్త రికార్డుల దిశగా కదిలాయి సూచీలు. ఒక దశలో ఇంట్రాడేలో జీవనకాల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది.
అమెరికా ఫెడ్.. వరుసగా మూడోసారి వడ్డీ రేట్లు తగ్గించడం.. మదుపరుల్లో ఉత్సాహం నింపింది. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబుడులు భారీగా పెరిగాయి. నేటి లాభాలకు ఇది ఊతమందించింది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 77 పాయింట్లు బలపడింది. చివరకు 40,129 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 37 పాయింట్లు వృద్ధి చెంది..11,881 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 40,392 (జీవనకాల గరిష్ఠ స్థాయి) పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,054 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,945 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,855 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎస్ బ్యాంకు అత్యధికంగా 24.03 శాతం లాభపడింది. ఎస్బీఐ 7.69 శాతం, ఇన్ఫోసిస్ 3.79 శాతం, టాటా మోటార్స్ 3.40 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.63 శాతం, హెచ్‌సీఎల్‌టెక్ 1.50 శాతం లాభాలను నమోదు చేశాయి.
టెక్ మహీంద్రా అత్యధికంగా 2.09 శాతం, టాటా స్టీల్ 1.95 శాతం, ఎం&ఎం 1.77 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.74 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.56 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 1.48 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి: ట్విట్టర్లో ఇకపై రాజకీయ ప్రకటనలు నిషేధం